ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మూడు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో బుధవారం, గురువారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు, శ్రీలంక మధ్య తీరందాటే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది.
అండమాన్ సమీపంలో 13వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని స్కైమెట్ మాడ్యూల్స్ ద్వారా తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది. తమిళనాడులో 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. దీని ప్రభావంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్రాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రైతులు పంట నూర్పిడి పనులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. ధాన్యం పంట తడవకుండా చూసుకోవాలని కోరారు. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు.