ఆట ముగిసే సమయానికి క్రీజులో రిషబ్, నితీశ్
అడిలైడ్ టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్ పై ఆసీస్ పై చేయి సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే కుప్పకూలగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను 337 పరుగుల వద్ద ముగించింది.ఆతిథ్య జట్టుకు 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా 86 పరుగుల వద్ద రెండోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించి మరో 251 పరుగులు జోడించి తొమ్మిది వికెట్లను కోల్పోయింది. మొత్తం 87.3 ఓవర్లు ఆడి 337 పరుగులు చేసింది.
ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించాడు. 141 బంతులు ఆడి 140 పరుగులు చేశాడు. లబుషేన్( 64), ఓపెనర్ మెక్ స్వీనీ (39) రాణించడం ఆసీస్ కు కలిసి వచ్చింది.
భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి,రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు స్వల్ప స్కోర్ కే ఔట్ అయ్యారు. కేఎల్ రాహుల్ (7)ను పాట్ కమిన్స్ ఔట్ చేశాడు. భారత జట్టు 8 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 42 పరుగులుచేసింది. ఆ తర్వాత యశస్వీ జైస్వాల్ (24) స్కాట్ బొలెండ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 13 ఓవర్ల వద్ద రోహిత్ సేన రెండో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ(11) మరోమారు నిరాశపరిచాడు. బోలాండ్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
మిచెల్ స్టార్క్ వేసిన 17.2 బంతికి శుభమన్ గిల్(28) పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ మరోమారు అభిమానులను నిరాశపరిచాడు. పాటికమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 15 బంతులు ఆడి ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 24 ఓవర్లు ఆడి ఐదు వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది.