మరాఠ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మహా వికాస్ అఘాడీలో పార్టీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన (యూబీటీ) నేత వ్యాఖ్యలను ఎస్పీ నేతలు తప్పుబట్టారు. అందుకు నిరసనగా కూటమి నుంచి తమ పార్టీ వైదొలుగుతుందని ప్రకటించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వాముల వారిని చూసి తాను గర్విస్తున్నా అని బాల్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామాలపై సమాజ్వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ తరహాలో శివసేన(యూబీటీ) వ్యవహరిస్తున్నందున కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఎస్పీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ ఎంవీకే కూటమితో కలిసి పోటీ చేయగా రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంవీఏ బహిష్కరించింది. ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అసిమ్ అజ్మీ, రైస్ షేక్ ఈ పిలుపును పాటించలేదు. శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు.
హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండీ’ బ్లాక్ ఓటమి చవిచూసిన నేపథ్యంలో కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి.