ఉత్తప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఏపీ ప్రజలను యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆహ్వానించారు. తెలుగు ప్రజలను ఆహ్వానించడానికి ఆయన విజయవాడ వచ్చారు. ఉప ముఖ్యమంత్రికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
విజయవాడలోని దుర్గమ్మ దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. ఇవాళ ఉదయం దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితోపాటు, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతోందని యూపీ డిప్యూటీ సీఎం విజయవాడ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. సబ్ కా సాద్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పధం వైపు తీసుకుని వెళుతున్నారని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పని చేస్తున్నట్లు గుర్తుచేశారు.
ప్రయాగ రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం ప్రాంతంలో జనవరిలో మహా కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. కుంభమేళా భక్తులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహా కుంభమేళాకు ఆహ్వానం పలికారు.