రేషన్ బియ్యం అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాకినాడ రేవు కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం ఎగుమతుల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిఐడి ఐజి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్పీ ఉమామహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలను సిట్ బృందంలో నియమించారు. సిట్ బృందానికి అవసరమైన సమాచారం అన్ని శాఖల నుంచి తీసుకునేందుకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో విడుదల చేశారు.
పేదల బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, ఆ బియ్యాన్ని రూపు మార్చి, ఉప్పుడు బియ్యం పేరుతో ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ స్మగ్లింగ్ జరుగుతోంది. రాజకీయనాయకులు, మిల్లర్లు, ఎగుమతిదారులు కుమ్మక్కు కావడంతో ఈ తతంగం సాగిపోతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు దృష్టి సారించింది. ఇప్పటికే కాకినాడ పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 52 వేల టన్నుల బియ్యం సీజ్ చేశారు. అందులో 26 వేల టన్నులు రేషన్ బియ్యంగా తేల్చారు.
రేషన్ అక్రమాలను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన సిట్ ప్రతి రెండు వారాలకు ఒకసారి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నారు? ఇప్పటిదాకా నమోదైన కేసుల వివరాలు, అక్రమార్కులపై నమోదైన కేసుల వివరాలతో సిట్ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనుంది. అక్రమార్కులపై పీడీ యాక్టు కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్దం అవుతోంది. గడచిన నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26 చోట్ల అక్రమ రేషన్ పట్టుకుని కేసులు నమోదు చేశారు.