తెలంగాణ తల్లి విగ్రహం రూపు బహిర్గతమైంది. ఈ నెల 9న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది.
బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపు అద్భుతంగా ఉంది. తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు.
తెలంగాణ సగటు మహిళను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ తల్లిని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ విగ్రహం తయారీలో కీలక పాత్ర పోషించారు.
ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. ఈ 17 అడుగుల ఈ విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.