నైరుతి బంగాళాఖాతంలో 8వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 12, 13వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని ఐఎండి స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి అనువైన వాతావరణం ఏర్పడింది. ఇది తమిళనాడు, శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన మాడ్యూల్స్ ప్రకారం డిసెంబరు 12, 13 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ తమిళనాడులో తీరం దాటే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తమిళనాడులో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతోపాటు తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది.