అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీ సెమీఫైనల్ 2 లో భారత్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో లక్విన్ (69) రాణించగా షారుజన్ (42) ఫర్వాలేదనిపించాడు. ప్రారంభంలో 8 పరుగులకే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది.
భారత బౌలర్లలో చేతన్ శర్మ మూడు వికెట్లు తీయగా కిరణ్, ఆయూశ్ చెరో రెండు వికెట్లు తీశారు. గుహా, హార్దిక్ రాజ్ చెరోక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
శ్రీలంక విధించిన 174 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. భారత్ 8 ఓవర్లలోనే 87 పరుగులు చేశారు. ఆ తర్వాతి ఓవర్ లో ఆయుష్ మాత్రే(34) ఔట్ అయ్యాడు. 28 బంతుల్లో 34 పరుగులు చేసి విహాస్ తెవ్మిక బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. స్కోర్ బోర్డు 91 వద్ద ఉన్నప్పుడు మొదటి వికెట్ నష్టపోయిన యువభారత్, ఆ తర్వాత సూర్యవంశీ ఔట్ కావడంతో రెండో వికెట్ కోల్పోయింది. సూర్యవంశీ 36 బంతుల్లో 67 పరుగులు చేసి మనీష బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లకు భారత్ రెండు వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. ఆండ్రే సిద్ధార్థ్(22) ఔట్ కావడంతో క్రీజులోకి కార్తికేయ వచ్చాడు. సిద్ధార్థ్ 27 బంతుల్లో 22 పరుగులు చేశాడు.
మొహమ్మద్ అమన్(25), కార్తికేయ కేపీ(11) భారత్ ను విజయ తీరాలకు చేర్చారు.
పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం
ఈ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ 1 జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 37 ఓవర్లలో 116 పరుగులు చేసింది. ఫర్హాన్ యూసఫ్ (32) టాప్ స్కోరర్ గా ఉన్నాడు. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 22.1 బంతుల్లోని ఛేదించింది. మూడువికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.