భారత సరిహద్దుల వెంట బంగ్లాదేశ్ సైన్యం బేరక్తర్ టీబీ 2 డ్రోన్లను మోహరించింది. ఈ నిఘా డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. 25 వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. వీటిని తుర్కియే నుంచి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ సరిహద్దు వెంట నిఘాకు ఉపయోగించడంపై భారత ఆర్మీ అప్రమత్తమైంది. డ్రోన్లకు సంబంధించిన ఫోటోలను అధికారులు సేకరించారు. బంగ్లాదేశ్ చర్యలపై సైనిక అధికారులు చర్చిస్తున్నారు.
బంగ్లాదేశ్ దూకుడు చర్యలను మాత్రం తగ్గించడం లేదు. మైనారిటీ హిందువులపై దాడులు ఆపాలని భారత్ కోరుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా సరిహద్దుల వెంట నిఘా డ్రోన్లను మోహరించడం చర్చనీయాంశంగా మారింది. జూన్, జులై మాసాల్లో జరిగిన రిజర్వేషన్ల హింసలో జైళ్ల నుంచి 3 వేల మంది ఉగ్రవాదులు, కరుడుగట్టిన ఖైదీలు తప్పించుకున్నారు. వారిలో 700 మంది ఆచూకీ లభించలేదు. వారు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉండటంతో నిఘాను పెంచినట్లు అనుమానిస్తున్నారు.
తుర్కియేలో తయారైన టీబీ 2 డ్రోన్లను బంగ్లాదేశ్ 12 కొనుగోలు చేసింది. ఇప్పటికే 6 డ్రోన్లు దిగుమతి చేసుకుంది. ఈ డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. యుద్ధ ట్యాంకులకు నష్టం చేయగలవు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఈ డ్రోన్లు వినియోగిస్తున్నారు.