రాజ్యసభలో నోట్ల కట్ట కలకలం రేపింది. గురువారం రాజ్యసభ ముగిసిన తరవాత భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. ఆ క్రమంలో 500, 100 నోట్ల కట్ట ఒకటి బయటపడింది. ఈ విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ఈ విషయాన్ని ఛైర్మన్ సభలోని సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.
222వ నెంబరు సీటు వద్ద నోట్ల కట్టను సిబ్బంది గుర్తించినట్లు ఛైర్మన్ తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద 500 నోట్ల కట్టను గుర్తించినట్లు చెప్పడంతో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో నోట్ల కట్టపై విచారణ జరపడం తమకు అభ్యంతరం లేదని, అయితే విచారణ నివేదిక రాకముందే అభిషేక్ సింఘ్వి సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందని చెప్పడాన్ని తప్పుపట్టారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని బీజేపీ సభ్యులు వాదించారు.
తాను రాజ్యసభకు వచ్చేటప్పుడు కేవలం రూ.500 మాత్రమే తెచ్చుకున్నానని అభిషేక్ సింఘ్వీ తెలిపారు. గురువారం 12 గంటల 47 నిమిషాలకు సభలోకి వచ్చానని, 3 నిమిషాల తరవాత సభను వాయిదా వేసినట్లు గుర్తుచేశారు. తరవాత తాను క్యాంటీనుకు వెళ్లి 1.30 గంటలకు ప్రాంగణం నుంచి వెళ్లిపోయినట్లు సింఘ్వీ చెప్పారు.
సభకు నోట్ల కట్టను తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రత దృష్ట్యా కూడా నోట్ల కట్టలను అనుమతించరు. ఇక సభలో లభ్యమైన నోట్లు అసలైనవా, నకిలీవా అనే విషయం కూడా తేలాల్సి ఉంది.