ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ గా తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌తో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని ప్రశంసించారు. విదేశాల్లోని భారత ఐటీ నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని తెలిపారు.
విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ను ప్రారంభించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందన్నారు.
డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.
నదుల అనుసంధానంతో భవిష్యత్ లో నీటి కొరత ఉండదన్న చంద్రబాబు, ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్ హబ్‌గా ఏపీ మారబోతోందన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. ఏపీకి ఉన్న వనరుల్లో అధిక తీరప్రాంతం ఒకటన్నారు.