రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశాలు నేటితో ముగిశాయి.వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయంచినట్లు ఆర్బీఐ చీఫ్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రెపోరేటును 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని వివరించారు.
అధిక ద్రవ్యోల్బణం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రతీ రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. మే 2022 నుంచి వరుసగా ఆరుసార్లు కలిపి మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటుని పెంచిన ఆర్బీఐ, ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెంచలేదు.
రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లలో కూడా ఎలాంటి మార్పుఉండదు. దీంతో ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండనట్లే. 2023-24 ఆర్థిక ఏడాదికి ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతంగా నమోదై నట్లు ఆర్బీఐ పేర్కొంది.
తనఖా లేకుండా మంజూరు చేసే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే క్యాష్ రిజర్వు రేషియోను 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు.