తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజుకు చేరుకున్నాయి. నేడు పంచమితీర్థం ఉత్సవం సందర్భంగా తొలుత స్వామి వారి ఆలయం నుంచి వేదపండితులు, టీటీడీ ఉన్నతాధికారులు అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతీ ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి తిరుచానూరుకు సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సారె ఊరేగింపులో పాల్గొన్న వారికి అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
సారె ఊరేగింపులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జియ్యంగార్లు, శ్రీవైష్ణవలు పాల్గొన్నారు.
వేంకటాచల మహత్యంలో పేర్కొన్న మేరకు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తిక మాసం శుక్లపక్షం, పంచమి తిథి, శుక్రవారం నాడు ఉద్భవించారు. అందుకే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు పంచమి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. పద్మ సరోవరం నుంచి ఉద్భవించిన అమ్మవారికి జరిపించే చక్రస్నానానని పంచమి తీర్థం అని పిలుస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రాత్రి పద్మావతిదేవి మహారాణీ అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అశ్వం వేగంగా పరిగెత్తే జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా పేర్కొన్నాయి. అమ్మవారి అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.