మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం నుంచి 8వ తేదీ ఆదివారం వరకు షష్టి కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
షష్టి కల్యాణ మహోత్సవాలలో మొదటి రోజైన ఆరవ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయనున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి యాగశాల ప్రవేశము, విజ్ఞేశ్వర పూజ, పుణ్యాహ వచనము, రుత్విగ్వరణ అంకురారోపణ, వాస్తు పూజ, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
డిసెంబరు ఏడవ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రాతః కాలార్చనలు, గోపూజ, నిత్య హోమము, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 11 గంటల నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఏడవ తేదీ సాయంత్రం 6 గంటలకు మయూర వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణంలో పాల్గొనదలచిన భక్తులు ఆలయ కార్యాలయంలో సంప్రదించవలసినదిగా భక్తులకు సూచించారు.
డిసెంబరు ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు ప్రాత కాలార్చనలు, గోపూజ, నిత్య హోమము, బలిహరణ, పంచామృత స్థపన, వసంతోత్సవం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. అదే రోజు 11 గంటలకు శేష వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీ స్వామివారి పుష్ప శయ్యాలంకృత పర్యంక సేవ కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరపనున్నారు. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.