ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో కొందరు డ్రిల్లింగ్ చేయడంతో ఆ ప్రాంతంలో 13 గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన చేపట్టారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం వెంటనే డ్రిల్లింగ్ పనులు నిలిపివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం గుర్తించేందుకు డ్రిల్లింగ్ పనులకు అనుమతి తీసుకున్నారని, అయితే ఆ ప్రాంతంలో నాణ్యత లేని యురేనియం ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో యురేనియం వెలికితీస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఆదోని డివిజన్ కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం వెలికి తీసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులతోపాటు, రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు కూడా పొందాల్సి ఉంది. ఇప్పటికే కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం వెలికితీసే కార్యక్రమం జరుగుతోంది. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో నాణ్యత లేని యురేనియం తవ్వకాలపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.