గత వారం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో అల్లరి మూకలు జరిపిన దాడిని, బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులకు దిగిన వారి డీఎన్‌ఏ, సంభల్‌లో హింసకు పాల్పడినవారి డీఎన్‌ఏ ఒక్కటేనని యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారు ఉండటం వల్లే దేశం 150 సంవత్సరాలపాటు బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు. సమాజంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి వర్గాలతో దేశానికి చాలా ప్రమాదకరమని యోగి ఆందోళన వ్యక్తం చేశారు.
కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు అయోధ్యలో జరిగిన 43వ రామాయణ్ మేళాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ విమర్శించారు. దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసున్న కొందరు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
సంభల్ అల్లర్లు జరిగిన ప్రాంతంలో నిఘా వర్గాలు నాలుగు ఖాళీ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని అమెరికాలో తయారు చేసినట్లుగా గుర్తించారు. ఆయుధాలు సంభల్‌కు ఎలా చేరాయనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ముఠాలకు సంభల్‌లో హింసకు వాడిన ఆయుధాలకు లింకులను అన్వేషిస్తున్నారు.