పాలస్తీనాపై భారత్ వైఖరిలో మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ సమర్థించదని, ఉగ్ర సమస్యను భారత్ చవిచూసిందన్నారు.రెండు దేశాల్లో శాంతి, భద్రతలు నెలకొనాలని భారత్ ఆశిస్తోందన్నారు. కాల్పుల విరమణ, సంధి కార్యక్రమాలను భారత్ ప్రోత్సహిస్తుందన్నారు.
ఐక్యరాజ్యసమితి నుంచి సహాయ చర్యలు అందించడాన్ని ఇజ్రాయెల్ నిషేధించడాన్ని జైశంకర్ తప్పుపట్టారు. దీనిపై చర్చిస్తామన్నారు. ఇటీవల భారత్ సహాయ సామాగ్రి పంపిందని గుర్తుచేశారు. 70 టన్నుల ఆహారం, 16 టన్నుల మందులు పంపినట్లు గుర్తుచేశారు.
ఉగ్రవాదం, హమాస్ అనే పదాలు లేకుండా పాలస్తీనా గురించి చర్చించడం అంటే సమస్యలను మరుగున పడేయడమేనని జైశంకర్ అభిప్రాయపడ్డారు. భారత్ ఉగ్ర బాధిత దేశమని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రోత్సహించే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి తెలిపారు.
ఇజ్రాయెల్‌కు రక్షణ సహాకారం విషయంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు ఉంటాయని జైశంకర్ తెలిపారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలున్నాయన్నారు. జాతీయ భద్రత విషయంలో రాజీపడేదే లేదన్నారు.మన జాతీయ భద్రత ప్రమాదంలో పడిన సందర్భాల్లో ఇజ్రాయెల్ ఆదుకుందన్ని జై శంకర్ గుర్తుచేశారు.