బంగ్లాదేశ్ జైళ్ల నుంచి పరారైన ఖైదీల్లో 700 మంది ఆచూకీ నేటికీ లభించలేదని జైళ్ల శాఖ చీఫ్ సయాద్ మహమ్మద్ మోతేర్ హుసేన్ ప్రకటించారు. విద్యార్థి ఉద్యమాల సమయంలో నిరసనకారులు జైళ్లను బద్దలు కొట్టారు. కొన్ని జైళ్లకు నిప్పు పెట్టారు. జూన్, జులై మాసాల్లో బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 3 వేల మంది ఖైదీలు తప్పించుకు పారిపోయారు. వారిలో 2300 మంది మాత్రమే లొంగిపోయారు. ఇంకా 700 మంది ఆచూకీ లభించలేదని జైళ్ల శాఖ చీఫ్ ప్రకటించారు.
జైళ్ల నుంచి పారిపోయిన వారిలో ఉగ్రవాదులు, కరుడుగట్టిన తీవ్రవాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఖైదీల వివరాలు పంపినట్లు మహమ్మద్ చెప్పారు. వారిని అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, వారంతా తప్పించుకు తిరుగుతున్నారని వెల్లడించారు.
జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరగాళ్లు పరారు కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పారిపోయిన ఖైదీల్లో చాలా మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. వారు దేశంలో ఉన్నారా? భారత్‌లోకి చొరబడ్డారా అనే అనేమానాలు కూడా బలపడుతున్నాయి.