కాకినాడ పోర్టును బలవంతంగా తన వద్ద నుంచి రాయించుకున్నారంటూ కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడికి ఇచ్చిన ఫిర్యాదుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతనితోపాటు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనిపె శరద్ చంద్రారెడ్డికి కూడా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. బలవంతంగా 6 వేల కోట్ల విలువైన కాకినాడ పోర్టులోని 41 శాతం వాటాలను అతి తక్కువ ధరకు బలవంతంగా బెదిరించి రాయించుకున్న కేసులో నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కాకినాడ పోర్టును 2021లో వైసీపీ అధికారంలో ఉండగా కర్నాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి బలవంతంగా అతి తక్కువ ధరకు అరబిందో ఫార్మాకు దక్కేలా ఎంపీ విజయసాయిరెడ్డి పావులు కదిపారని తెలుస్తోంది. ముంబై, చెన్నై నుంచి ఆడిటర్లను రప్పించి కాకినాడ పోర్టులో ఆడిటింగ్ నిర్వహించారు. ఆ తరవాత అందులో అవకతవకలు జరిగాయని వెయ్యి కోట్లు జరిమానా విధిస్తామంటూ కర్నాటి వెంకటేశ్వరావును బెదిరించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
సీఐడికి అందిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.