తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. వివిధరకాల పుష్పాలతో సర్వాలంకార శోభితమైన రథంలో సిరుల తల్లి అలమేలు మంగ విహరించి భక్తులను అనుగ్రహించారు. వేదపండితులు దివ్య ప్రబంధ పారాయణంతో భక్తులు తరించారు. వజ్రపుబొట్టుతో అమ్మవారు సర్వసుందరంగా దర్శనమివ్వడంతో భక్తులు తరించిపోయారు.
రథోత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా సిరుల తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయి.
రథోత్సవం జరిగేటప్పుడు మిరియాలు, ఉప్పు, బియ్యం, నువ్వులు విసిరితే రథచక్రాల కింద అవిపడి నలిగిపోయినప్పుడు భక్తుల పాపాలు కూడా అలాపోతాయని నమ్ముతారు.
బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకరణలో చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుంచి వాహనసేవ సాగింది. క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు.ఈ వాహనసేవలో విహరించే అమ్మవారిని సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు.