క్రిప్టో కరెన్సీలో రారాజుగా చలామణి అవుతోన్న బిట్ కాయిన్ మరో మైలురాయిని దాటింది. మొదటి సారి ఒక్క బిట్ కాయిన్ విలువ లక్ష అమెరికా డాలర్లను దాటింది. అంటే మన రూపాయి విలువలో ఒక్క బిట్ కాయిన్ 85 లక్షలతో సమానం. ఒక దశలో లక్షా 519 డాలర్లను దాటిన బిట్ కాయిన్ ప్రస్తుతం లక్షా 215 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే లక్షా 20 వేల డాలర్లకు దాటిపోతుందని అంచనా.
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటంతో క్రిప్టో కరెన్సీకి రెక్కలు వచ్చాయి. తాను అధికారంలోకి వస్తే క్రిప్టో కరెన్సీపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీనికి తోడు
ఎలాన్ మస్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ బాధ్యతలు కట్టబెట్టడం కూడా కారణంగా తెలుస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు పాల్‌కు అట్కిన్కు అప్పగించడం కూడా కారణంగా భావిస్తున్నారు.
అమెరికా ఎన్నికల ముందు 70 వేల డాలర్లకు దిగువన ఉన్న బిట్ కాయిన్ లక్ష డాలర్లు దాటిపోయింది. రెండేళ్ల కిందట కనిష్ఠంగా 17 వేల డాలర్లకు పడిపోయింది. 2009లో జపాన్‌కు చెందిన సాఫ్ట్వేర్ నిపుణుడు తయారు చేసిన బిట్ కాయిన్ ధర నేడు ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. బిట్ కాయిన్ తరవాత అనేక క్రిప్టో కరెన్సీలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు.