మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్‌సిపి అధ్యక్షుడు అజిత్ పవార్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.
రేపు, అంటే డిసెంబర్ 5న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగే ఆ కార్యక్రమంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బిజెపి పరిశీలకుడు విజయ్ రూపానీ వెల్లడించారు. కొత్త క్యాబినెట్లో కొలువుతీరే మంత్రుల పేర్లను శివసేన, ఎన్‌సిపి నేతలతో చర్చించాక ఖరారు చేస్తారని రూపానీ చెప్పారు. మహారాష్ట్ర విధాన భవన్లో జరిగిన బిజెపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి హాజరైన విజయ్ రూపానీ, ‘‘మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు, అంతా బాగానే ఉంది’’ అని చెప్పారు. ఆ సమావేశంలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గత నెల జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. మొత్తం 288 స్థానాల్లో 235 సీట్లను గెలుచుకుంది. వాటిలో 132 స్థానాల్లో గెలుపు సొంతం చేసుకున్న బీజేపీ, రాష్ట్ర శాసనసభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్‌సిపి 42 సీట్లు గెలుచుకుని మహాయుతి కూటమి విజయాన్ని పరిపూర్ణం చేసారు.