ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో న్యాయస్థానం సర్వే చేయాలని ఆదేశించిన బృందం మీద దాడి చేసిన ముస్లిం మూకలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ దొరికిన బులెట్ కార్ట్రిడ్జ్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుని పరీక్షించింది. ఆ పరీక్షలో విస్తుగొలిపే విషయాలు బైటపడ్డాయి. ఆ తూటాలు పాకిస్తాన్, అమెరికాలో తయారైనవి అన్న విషయం వెల్లడైంది. సంభల్‌లో ముస్లిం మూకలు జరిపిన కాల్పుల్లో ఉపయోగించిన తుపాకీ బులెట్లు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన తూటాలు అని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయింది. నవంబర్ 24నాటి హింసాకాండ తర్వాత అక్కడి కాలువలో తూటాలు పేల్చగా పడిపోయిన కార్ట్రిడ్జ్లు ఐదు దొరికాయి.
ఆ వివరాలను అదనపు ఎస్పి శిరీష్ చంద్ర మీడియాకు వివరించారు. ‘‘షాహీ జామా మసీదు సర్వే కోసం కోర్టు ఆదేశించిన బృందం వచ్చిన నవంబర్ 24న హింస జరిగిన కోట్ గర్వీ ప్రాంతానికి ఫోరెన్సిక్ టీమ్ మంగళవారం వచ్చింది. అక్కడి డ్రయినేజీలో ఫోరెన్సిక్ టీమ్‌కు ఆరు కార్ట్రిడ్జ్లు దొరికాయి. వాటిలో ఒకటి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైనది’’ అని చెప్పుకొచ్చారు.
విదేశాలకు సంబంధించిన, అదీ శత్రుదేశానికి సంబంధించిన తూటాలు సంభల్‌లో దొరకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ సమాచారం తెలిసిన వెంటనే భద్రతా సంస్థలను అప్రమత్తం చేసారు. ఆ కార్ట్రిడ్జ్లలో రెండు 12బోర్ షెల్స్, రెండు 32బోర్ షెల్స్ కాగా మిగతా రెండూ 9మిల్లీమీటర్ షెల్స్.
‘‘ఒక 9ఎంఎం కార్ట్రిడ్జ్ పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైంది. దాని తూటాను పేల్చడం జరిగింది. ఇంకో 9ఎంఎం కార్ట్రిడ్జ్ అమెరికాకు చెందినదై ఉండవచ్చు. ఇంకో రెండు 12బోర్ షెల్ కేసింగులు, మరో రెండు 32 బోర్ షెల్ కేసింగ్లూ కూడా దొరికాయి. ఆ ప్రాంతంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు మెటల్ డిటెక్టర్లతో వెతుకుతున్నారు’’ అని డివిజనల్ కమిషనర్ ఆంజనేయ సింగ్ ప్రకటించారు.
ఈ వ్యహారం గురించి దర్యాప్తు చేయడానికి రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్ టీమ్‌లు) ఏర్పాటు చేసారని సంభల్ ఎస్పి కృష్ణకుమార్ చెప్పారు. ‘‘ఇక్కడ విదేశీ తూటాల కార్ట్రిడ్జ్లు దొరకడం మాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆ విషయమై దర్యాప్తు సంస్థల సహకారంతో నిశితంగా దర్యాప్తు చేస్తాం. ఎన్ఐఎ గతంలో జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేరస్తుల సమాచారాన్ని సేకరించడానికి స్థానిక పోలీసుల సాయం తీసుకుంది. ఇప్పుడు మేమూ అంతే. మేం నేరస్తుల హిస్టరీ తనిఖీ చేస్తాం. వారికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా, సంభల్‌లో హింసకు పాల్పడినది ఎవరు, వారి నేపథ్యం ఏమిటి అని తనిఖీలు చేస్తాం’’ అని వివరించారు.
సంభల్‌లో కల్కి భగవానుడి ఆలయాన్ని మసీదు ఆక్రమించిందంటూ సుప్రీంకోర్టు అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్, మరో ఏడుగురు కలిసి ఉత్తరప్రదేశ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసారు. దానికి స్పందనగా న్యాయస్థానం ఆ మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. నవంబర్ 19న భారీ పోలీసు బందోబస్తు నడుమ జామా మసీదులో సర్వే చేపట్టారు. నవంబర్ 24న రెండవ దఫా సర్వే నిర్వహించడానికి బృందం వెళ్ళినప్పుడు ముస్లిం మూకలు హింసాకాండకు తెగబడ్డాయి. పోలీసుల మీద రాళ్ళు రువ్వారు, తుపాకులు కాల్చారు, వాహనాలు-దుకాణాలు తగులబెట్టారు. ఆ దాడిలో కనీసం 20మంది పోలీసులు గాయపడ్డారు. ఆనాటి ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. వారిలో ముగ్గురి చావుకు కారణం ముస్లిం మూకల కాల్పులేనని పోలీసులు స్పష్టం చేసారు. మృతుల్లో ఇద్దరు నాటుతుపాకీ కాల్పుల వల్ల చనిపోయారని శవపరీక్షలో తేలింది. మరో శవంలో దొరికిన తూటా యూపీ పోలీసులు ఉపయోగించేది కాదని నిర్ధారణ అయింది. పోలీసులు కేవలం బాష్పవాయువు ప్రయోగించారని, రబ్బర్ తూటాలు కాల్చారనీ సంభల్ ఎస్పి కృష్ణకుమార్ బిష్ణోయి వెల్లడించారు.
అయితే సర్వే పూర్తయిందని సంభల్ జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ఆ బృందం తన నివేదికను సివిల్ కోర్టు కు నవంబర్ 29న సమర్పించింది. అయితే జిల్లా కోర్టు విచారణకు వ్యతిరేకంగా ముస్లిముల పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జిల్లా కోర్టు విచారణపై ప్రస్తుతానికి స్టే విధించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ 2025 జనవరిలో జరుగుతుంది. మరోవైపు, జరిగిన హింస ఘటనపై దర్యాప్తు చేయడానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేసారు.