మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి 2019-2024 మధ్యకాలంలో 2,277 వ్యాపార సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇతర రాష్ట్రాలకు తరలించాయి. వాటిలో 39 లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
బెంగాల్ నుంచి మొదటిసారి రాజ్యసభ ఎంపి అయిన బిజెపి నాయకుడు సమిక్ భట్టాచార్య పార్లమెంటులో మంగళవారం నాడు అడిగిన ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం తెలియజేసింది. దానిప్రకారం, గత ఐదేళ్ళలో రెండువేలకు పైగా కంపెనీలు బెంగాల్ నుంచి తరలిపోయాయని స్పష్టమైంది. ఆ కంపెనీలు తరలిపోడానికి కారణాలను బెంగాల్ ప్రభుత్వం ఏమైనా తెలియజేసిందా, రాష్ట్రంలో కంపెనీలను నిలబెట్టుకోడానికి, లేదా రాష్ట్రానికి కొత్త కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించడానికి తృణమూల్ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేసిందా అని ఎంపీ ప్రశ్నించారు. దానికి ‘పాలన, నిర్వహణ, సౌకర్యం, నియంత్రణ, ధరవరలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తరలిపోయినట్లు తెలుస్తోంది’ అని జవాబు వచ్చింది.
బెంగాల్ నుంచి అంత పెద్ద సంఖ్యలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం ఆందోళనకరమైన విషయం అని ఆ రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందన్నది ఈ గణాంకాలను బట్టి అర్ధమవుతోందని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాల లేమి, వ్యాపార-పారిశ్రామిక అభివృద్ధి క్షీణతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. మమతా బెనర్జీ సర్కారు పరిశ్రమలకు వ్యతిరేక ధోరణిలో వ్యవహరిస్తోంది’ అని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.