ఒడిషా గంజాం జిల్లాలో రామాయణ నాటక ప్రదర్శనలో ఒక ఘోరం జరిగింది. రాక్షస పాత్ర ధరించిన బింబాధర్ గౌడ (45) అనే నటుడు వేదిక పైనే ఒక పందిని చీల్చి చంపి, దాని పచ్చి మాంసాన్ని తిన్నాడు. అదే నాటకంలో బతికున్న పాములను కూడా ఆడించారు. ఆ కిరాతకమైన సంఘటన హింజిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రలబ్ గ్రామంలో నవంబర్ 24న జరిగింది. ఆ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. శాసనసభలో సైతం ఆ ఘటనను ఖండించారు.
దిగ్భ్రాంతికరమైన ఆ చర్యకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దానిపై జంతువుల హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ ఎమ్మెల్యేలు బాబూసింగ్, సనాతన్ బిజులీ ఆ సంఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దారుణమైన పనికి పాల్పడిన బింబాధర గౌడను, కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసారు. జంతువులను హింసించారని, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో పోలీసులు వారిపై కేసులు పెట్టారు.
ఆ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దానిలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించే పనిలో ఉన్నామనీ బరంపురం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ ఖోఖర్ చెప్పారు. ఆ నాటక ప్రదర్శనలోనే సజీవంగా ఉన్న పాములను ఆడించారు. అటవీశాఖ నియమాలకు అది విరుద్ధం కావడంతో, బాధ్యులపై చర్యలకు సిద్ధపడుతున్నారు. ఒడిషాలో గత ఆగస్టులో జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పాములను బహిరంగంగా ప్రదర్శించడంపై నిషేధం ఉంది.
గంజాం జిల్లాలో కంజియానాల్ యాత్ర సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో నాటకం ప్రదర్శించారని, దానికి పెద్దస్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించడం కోసమే ఈ దారుణమైన చర్యలకు పాల్పడ్డారనీ హింజిలి పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీనిబాస్ సేథీ చెప్పారు. స్టేజి మీద సీలింగ్ నుంచి బతికున్న పందిని వేలాడదీసి దాన్ని కత్తితో చీల్చి చంపి, ప్రేక్షకులు అందరూ చూస్తుండగా దాని పచ్చిమాంసాన్ని తిన్నాడు. దానిపై జంతువుల హక్కుల కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఆ సంఘటనపై కేసు రిజిస్టర్ చేసామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ఇనస్పెక్టర్ శ్రీనిబాస్ సేథీ చెప్పారు.