తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 7 గంటల 28 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ ప్రకటించింది. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రం వద్ద 5 తీవ్రతను గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 250 కి.మీ వరకు భూమి కంపించింది. భూకంపం ప్రభావంతో ఎక్కడా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారు. కొందరు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో భూకంపం తీవ్రతకు సీలింగ్ ఫ్యాన్లు ఊగడాన్ని స్పష్టంగా ప్రజలు గమనించారు.
దక్షిణ భారతదేశం 5వ నెంబరు భూకంప జోన్లో ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. ఉత్తరభారత దేశంతో పోల్చుకుంటే దక్షిణభారత దేశంలో భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుందన్నారు. భూమి లోపల పొరల్లో సర్దుబాట్ల వల్ల కంపనాలు వచ్చాయని తెలిపారు.
భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో సరిగ్గా 50 సంవత్సరాల కిందట భూకంపం వచ్చింది. అప్పుడు కూడా 5 నమోదైంది. ప్రస్తుతం వచ్చిన భూకంప తీవ్రత కూడా 5గా నమోదైంది. అయితే ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించలేదు.
హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జనం పరుగులు తీశారు. తాజా భూకంపంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.