శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించుకునే కానుకలతో నిర్వహిస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేసారు.
విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెంగయ్య తరగతి గదుల్లో క్రైస్తవమత ప్రచారం చేస్తున్న సంగతి బైటకు వెల్లడైంది. దాంతో బజరంగ్దళ్ కార్యకర్తలు ఇవాళ డిపార్ట్మెంట్కు వెళ్ళి ప్రొఫెసర్‌ను నిలదీసారు. ప్రతీరోజూ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్టుకు బదులుగా బైబిల్ బోధిస్తూ, హిందూ దేవీదేవతలను కించపరుస్తూ విద్యార్ధులను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ప్రొఫెసర్ చెంగయ్య కార్యాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు, సాహిత్యం గుర్తించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళారు.
చెంగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్ధులకు క్రైస్తవమతం గురించి బోధిస్తున్న ఆడియో రికార్డులు బైటకొచ్చాయని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుడి విద్యాసంస్థలో అన్యమత ప్రచారం జరుగుతున్నా వైస్ ఛాన్సలర్ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేసారు.
బజరంగ్దళ్ కార్యకర్తలు ప్రొఫెసర్ని అన్యమత ప్రచారం గురించి అడిగే సందర్భంలో వాగ్వాదం జరిగింది. ఆవేశం పట్టలేని కార్యకర్తలు చెంగయ్య కారుపై రాళ్ళతో దాడి చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బజరంగ్ దళ్ నాయకులను బైటకు పంపించివేసారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో క్రైస్తవ మత ప్రచారంపై ఓ అధ్యాపకురాలు రెండు రోజుల కిందట యూనివర్సిటీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావును సంప్రదించగా కమిటీ వేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.