దేవాలయాలకు భక్తులు సమర్పించుకుంటున్న విరాళాలను, , వదాన్య దాతలు ఇచ్చుకుంటున్న ఆస్తులనూ ఆలయాల నిర్వహణ పేరిట ప్రభుత్వాలు దోచుకోవడం మన కళ్ళ ముందరి కథే. భక్తులిచ్చిన కానుకలను పూజాదికాలకు, పూజారుల జీతభత్యాలకు తక్కువగా ఇచ్చి మిగతా సొమ్ములో కొంతభాగాన్ని ప్రభుత్వాధికారులకు వేతనాలుగా చూపిస్తున్నారు. మెట్టువాటాను మాత్రం రకరకాల పేర్లతో దోచుకు తింటున్నారు. ఆ క్రమంలో భక్తిభావం వెనుకడుగు పడుతోంది. దైవసేవతో సంబంధం లేని ఎంతోమంది, ఉద్యోగుల పేరుతో గుడుల్లోకి చొరబడి వాటి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఈ అరాచకం ఎలా మొదలైంది? దానికి విరుగుడు ఏమిటి? ఆ విషయాలను ‘ఆంధ్రాటుడే’ ముఖాముఖిలో వివరించారు విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వరశర్మ.
♠ దేవాలయాల నిర్వహణ పూర్వం వ్యక్తుల చేతిలో ఉండేది. ఇప్పుడు ప్రభుత్వాల చేతిలో ఉంది. ఆ రెండింటికీ తేడా ఏమిటి?
♦ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళడం అనేది స్వతంత్ర భారతదేశంలో ప్రారంభం అవలేదు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాల చరిత్రను చూస్తే… మహమ్మదీయుల పరిపాలనా కాలంలో దేవాలయాలను ధ్వంసం చేసి, దేవాలయాలను దోపిడీ చేసిన సందర్భాలు కోకొల్లలు. అదేపనిగా పెట్టుకుని గుడులను దోచుకునేవారు. విజయానికి సంకేతంగా మాత్రమే కాకుండా ఆర్థికంగానూ దోపిడీ చేసారు. దేశం మొత్తం అంతటా అదే అనుభవం. లక్షల కొద్దీ దేవాలయాలను ధ్వంసం చేసారు, మజీదులుగా మార్చారు. దక్షిణ భారతదేశంలో మద్రాసు ప్రెసిడెన్సీ ముందు, ఈస్ట్ ఇండియా కంపెనీ రావడానికి ముందు, మహమ్మదీయుల పరిపాలనా సమయంలో ఆర్కాటు నవాబు అధీనంలో ఉన్నప్పుడు, ధనవంతమైన, సంపన్నమైన దేవాలయాలను దోపిడీ చేసే క్రమంలో హిందూ దేవాలయాలపైన కూడా దాడులు చేసారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఆనాటి ధార్మిక నాయకులు లేదా సాధు సన్యాసులు ఆర్కాటు నవాబు దగ్గరకు వెళ్ళి, ‘మేం మీకు కప్పం చెల్లించుకుంటాం, మీరు దాడులు చేయవద్దు అని ఒప్పందం చేసుకున్న దరిమిలా దేవాలయాల ఆదాయం మహమ్మదీయులు వసూలు చేసుకోవడం ప్రారంభమైంది. ఆర్కాటు నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోయాక వారి పరిపాలనలోకి మొదలైంది. దక్షిణభారతదేశంలో మద్రాస్ కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభించింది. ఆర్కాట్ నవాబును ఓడించిన తర్వాత ఆ నవాబు ఆదాయ మార్గాలు ఏమిటని వారు రికార్డులు చూసారు. భూమిశిస్తు వగైరా ఆదాయాలు ఎక్కడినుంచి వస్తున్నాయని గమనించారు. ఆ పన్నులతో పాటు దేవాలయం నుంచి వచ్చే ఆదాయం కూడా ఉందని చూసారు. అలా, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా దేవాలయాల నుంచి ఆదాయాన్ని తీసుకోవడం ప్రారంభించింది. దాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేసింది. 1857 ప్రథమ భారత స్వతంత్ర పోరాటానికి ముందు పరిస్థితి ఇది. 1857 పోరాటం తరువాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ముగిసి బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన ప్రారంభమైంది. అప్పటినుంచీ బ్రిటిష్ ప్రభుత్వం కూడా దేవాలయాల ఆదాయాన్ని వసూలు చేయడం ప్రారంభించింది. ఆ రకంగా స్వతంత్రానికి ముందే బ్రిటిష్ ప్రభుత్వము ఒక చట్టాన్ని రూపొందించి దేవాలయాల నిర్వహణ క్రమబద్ధీకరించింది. వాళ్ళు కేవలం వార్షికంగా ఇంత సొమ్ము తీసుకోవడం అనే పద్ధతికి పరిమితమయ్యారు. వారు చేసిన చట్టం కూడా అంతవరకే పరిమితం అయింది. నియమితంగా డబ్బులు క్రమబద్ధంగా వచ్చే విధంగా చూసేవారు, అంతేతప్ప నిర్వహణలో వేలు పెట్టలేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరవాత ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో చట్టాన్ని సవరించారు. అప్పటినుంచీ దేవాలయాల నిర్వహణలో కూడా వేలుపెట్టడం మొదలుపెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చట్టాలను సవరించడం మొదలుపెట్టారు. 1984లో చల్లా కొండయ్య కమిషన్ పేరుతో అనేక మార్పులు చేసి దేవాలయ వ్యవస్థ పూర్తిగా కుంటుపడేలా చేసారు. అంతకుముందున్న ‘హిందూ ధర్మ ప్రచార పరిషత్’ అనే విభాగం పేరులోని ‘హిందూ’ అన్న పదాన్ని తీసేసి ‘ధర్మ ప్రచార పరిషత్ – డిపిపి’ అని మార్చిన ఘనత కూడా చల్లా కొండయ్య కమిషన్‌దే. ధార్మిక ప్రచారం కోసం హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, దైవభక్తి, ధార్మిక నైతిక జీవనము వంటి విషయాల గురించి ప్రచారం చేసే వందల కొద్దీ చిన్నచిన్న పుస్తకాలు ఉచితంగా పంచడానికో లేక చౌకగా విక్రయించడానికో చేసే ప్రచురణలను నిలిపివేసారు. అలా, దేశానికి స్వతంత్రం రావడానికి ముందునుంచే ఈ చట్టం ద్వారా ప్రభుత్వాల అజమాయిషీ ప్రారంభమైంది. దేవాలయాలను పూర్తి అజమాయిషీలోకి తీసుకుని అధికారంలో ఉన్న ప్రభుత్వ పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాల ఆర్థిక వనరులు, వాటి స్థిరాస్తులు, చరాస్తులను యథేచ్ఛగా వాడుకోవడం మొదలుపెట్టారు. అవినీతి ప్రారంభమైంది. రాజకీయ జోక్యం వల్లనే మందిరాలు ఇవాళ అనేకమైన అవకతవకలు, అవినీతి కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి.
♠ దేవదాయ శాఖ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉందా? ఎక్కడెక్కడ ఉంది? వాటి పనితీరు ఎలా ఉంటుంది?
♦ దక్షిణ భారతదేశంలోని ఎండోమెంట్ చట్టాలకూ, ఉత్తర భారతదేశంలోని ఎండోమెంట్ చట్టాలకూ సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 24వేల పైచిలుకు దేవాలయాలు ఎండోమెంట్ చట్టం పరిధిలో ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 21వేల దేవాలయాలు ఉన్నాయి. 37వేల దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. కర్ణాటకలో సుమారు 27వేల దేవాలయాలు ఉన్నాయి. ఇలా ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న దేవాలయాలను వాటి ఆదాయాన్ని బట్టి ఎ, బి, సి గ్రేడులుగా వర్గీకరించారు. ఉత్తరభారతదేశంలో ఈ పరిస్థితి లేదు. ప్రముఖమైన దేవాలయాల్లో ప్రభుత్వం పరిమితంగా జోక్యం చేసుకునేలా చట్టాలున్నాయి. ఉదాహరణకి అమరనాథ్ ష్రైన్ బోర్డ్, వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్, కాశీ విశ్వనాథ దేవాలయం… అలా కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వం ట్రస్టుబోర్డులను ఏర్పాటు చేసింది. ఆలయ వ్యవస్థలో పూర్తిగా జోక్యం చేసుకోకుండా పరిమితంగా మాత్రమే కలగజేసుకుంటాయి. మరొక రకమైన దేవాలయాలు ఉన్నాయి. రాజసంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పుడు సంస్థానాధీశుల ద్వారా నిర్వహించబడుతున్న దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరభారతదేశంలో మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ‘సియాసీ టెంపుల్స్’ అనే పేరుతో ఉన్నాయి. రాజసంస్థానాలను వాటి అధీశులు భారతదేశంలో విలీనం చేసేటప్పుడు దేవాలయాల నిర్వహణ కూడా మీరే చూసుకోండంటూ ప్రభుత్వానికి అప్పగించినవి ఉన్నాయి. అలాంటి దేవాలయాల కోసం ప్రత్యేకమైన చట్టం ఉంది. అందులోనూ హిందూధర్మానికి అనుగుణమైన పద్ధతిలో మార్పుచేర్పులు చేయడం గురించి విశ్వహిందూ పరిషత్ ఆలోచించింది.
♠ మన రాష్ట్రంలో దేవదాయ ధర్మదాయ శాఖ పనితీరుపై చాలా విమర్శలున్నాయి. అసలు ఆ శాఖ గురించి విహెచ్పి భావన ఏమిటి?
♦ విశ్వహిందూ పరిషత్ స్థాపన నుంచీ, హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యత అనేది హిందూ సమాజం స్వతంత్ర ప్రతిపత్తిగా నిర్వహించుకోవాలి, ప్రభుత్వ స్వాధీనంలో ఉండరాదు అనే డిమాండ్‌తో పనిచేస్తూ ఉంది. ప్రస్తుత వాతావరణంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంతో మాత్రమే కాదు, విశ్వహిందూ పరిషత్ అనేక దశాబ్దాల నుంచీ, పరిషత్ స్థాపించినప్పటినుంచీ కూడా దేవాలయాల వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హిందూ ధార్మిక పరిషత్తుకు అప్పగించాలి అనే పద్ధతిలోనే కృషి చేస్తూ వచ్చింది. దేవాలయాల నిర్వహణలో అవకతవకలను లెక్కించాలంటే వందల్లో ఉంటాయి. పూజారుల జీతాలు, ప్రభుత్వాధికారిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీతాలే చూడండి. ప్రభుత్వాధికారికి ప్రభుత్వం స్కేల్ ప్రకారం వేతనం ఉంటుంది. దాన్ని ప్రభుత్వం ఇవ్వదు, దేవాలయం ఆదాయం నుంచి ఇవ్వాలి. పూజారీ ప్రభుత్వోద్యోగే. కానీ పూజారికి ప్రభుత్వం స్కేల్ మాత్రం ఇవ్వరు. దేవాలయ భూములను రాజకీయ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోవడం, ట్రస్టు బోర్డు సభ్యులు కుమ్మక్కై దేవాలయాల స్థిరాస్తులను అమ్మేయడం, స్వీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యతలకు సైతం దేవాలయాల స్థిరచరాస్తులను ఉపయోగించుకోవడం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే స్థితిని మనం చూస్తున్నాం. అవకతవకల విషయానికి వస్తే సెక్యులరిజం పేరిట హైందవేతరులను దేవాలయాల ఉద్యోగాల్లో నియమించడం, లౌకికరాజ్యంలో ఎవరైనా ఉండవచ్చు అనే పద్ధతిని అవలంబించడం చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అన్నిరంగాల్లో ఏరకంగా అవినీతికి పాల్పడతారో ఆ పద్ధతులన్నీ దేవాలయ వ్యవస్థలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. దేవాలయ వనరులనూ, దేవాలయాల ఆదాయాన్నీ పెంచే ఆలోచన ఏమీ లేకుండా, దేవాలయాల ఆదాయం తరిగిపోయేలా, దేవాలయాన్ని ప్రభుత్వ ఆస్తిగా భావించేలా మార్చేసారు. దర్శనానికి వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసేలా ప్రతీదానికీ డబ్బులు పెట్టేసారు. డబ్బులు లేకుండా దర్శనం లేదు. డబ్బులు ఉన్నవాడికే భగవంతుడు, సాధారణ ప్రజలకు దేవుడు అందుబాటులో లేకుండా చేసారు. ఇలాంటి అవకతవకలన్నీ జరగడానికి కారణం ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యమే. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ దేవాలయాల కోసం ఏర్పాటు చేయాలి అన్నది మొదటినుంచీ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. జరుగుతున్న అవకతవకల విషయంలో. చివరికి గుడుల దగ్గర పూలూ పళ్ళూ అమ్మడానికి హైందవేతరులకు ఇవ్వడం, దానిమీద గొడవలు, కొట్లాటలు, కేసులు అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అనుభవంలోకి వచ్చిన విషయాలే. అన్యమతస్తులు దేవాలయాల మీద దాడి చేసి, ధ్వంసం చేసి, రథాలను తగులబెట్టి, విగ్రహాలను పగలగొట్టి, గుడులను పగలగొట్టినప్పటికీ ఎవరో పిచ్చివాళ్ళు, మనస్థిమితం లేనివాళ్ళు చేసిన పని అని చెప్పి పక్కనపెట్టి సామాన్య హిందూ ప్రజల మనోభావాలను కించపరచడాన్ని రాజకీయ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడాన్ని చూస్తున్నాం. కాబట్టి మొదటినుంచీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ హిందూ సమాజానికి అప్పగించాలి. మహమ్మదీయులు, క్రైస్తవులూ తమ ప్రార్థనాప్రదేశాలను స్వతంత్ర ప్రతిపత్తితో నిర్వహించుకుంటున్నారు కదా. హిందూ సమాజం అంత చేతకానిది అయిందా? వేలకొలదీ కార్మికులు ఉండే ఎన్ని పరిశ్రమలను హిందువులు నిర్వహించడం లేదు? హిందూ సమాజానికి నిర్వహణా సామర్థ్యం ఏమి తక్కువ ఉంది? ఎండోమెంట్స్‌లో లేని ప్రైవేటు దేవాలయాలు ఆర్థికంగా కానీ, భక్తులకు వసతులు సౌకర్యాల కల్పన విషయంలో కానీ ఎంత చక్కగా అభివృద్ధి సాధిస్తున్నాయి? నిర్వహణలో అనుభవం ఉన్నవారికి, వదాన్యులకూ హిందూ సమాజంలో కొరవ లేదు కదా. హిందూ సమాజానికి తమ ఆలయాలను స్వతంత్రంగా నిర్వహించుకోగల అన్ని సమర్థతలూ ఉన్నాయి. కాబట్టి ఒక చట్టాన్ని చేయడం ద్వారా దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించాలి అనే ప్రత్యామ్నాయాన్ని విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వాల ముందు ఉంచుతోంది.
(సశేషం)