తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతీరోజు అమ్మవారికి వాహనసేవలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సేవల్లో తమిళనాడులోని శ్రీరంగం శ్రీ వైష్ణవులు పాల్గొంటున్నారు.
శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 32 ఏళ్ళుగా ఈ సేవల్లో పాల్గొని తమ భక్తిని చాటుతున్నారు.ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లను, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు. ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది.
ఇంత బరువును కూడా సంతోషంగా మోస్తూ వాహనసేవల్లో శ్రీరంగం శ్రీవైష్ణవులు పాల్గొంటున్నారు. శ్రీ కాంతన్ నేతృత్వంలో 32 ఏళ్లుగా ఈ కైంకర్యంలో భాగస్వాములు అవుతున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులుగా పనిచేస్తూనే మొత్తం 52 మంది ఈ సేవల్లో పాల్గొంటున్నారు.
శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలోనూ అవసరమైన సందర్భాల్లో సేవలు అందిస్తున్నారు. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీపద్మావతి అమ్మవారిని తమ భుజాలపై మోయడం పూర్వజన్మ సుకృతమని సేవకులు చెబుతున్నారు. అమ్మవారి కృపతో తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.