ఏప్రిల్ 2020 తర్వాత దెబ్బతిన్న భారత-చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ లోక్‌సభలో వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణలు జరిగాయి. 45ఏళ్ళలో మొదటిసారిగా రెండు పక్షాలలోనూ సైనికులు చనిపోయారు. అప్పటినుంచీ ఇరుదేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘‘అప్పటినుంచీ నిరంతరాయంగా దౌత్యపరమైన చర్చలు జరుపుతూ వస్తున్న ఫలితం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొంత మెరుగుదల వచ్చింది’’ అని జయశంకర్ పార్లమెంటుకు వివరించారు.
సరిహద్దు సమస్యకు ద్వైపాక్షిక చర్చల ద్వారా న్యాయమైన, తార్కికమైన, పరస్పరం అంగీకారయోగ్యమైన పరిష్కారం కనుగొనాలన్న విధానానికే భారతదేశం కట్టుబడి ఉందని జయశంకర్ పార్లమెంటుకు చెప్పారు. అయితే ఇటీవలి అనుభవాల దృష్ట్యా సరిహద్దుల నిర్వహణపై మరింత నిశితంగా దృష్టి సారించడం అవసరమని స్పష్టమైందని వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మూడు కీలకమైన సూత్రాలను అనుసరించడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఆ మూడు సూత్రాలూ ఏంటంటే…
వాస్తవాధీన రేఖను ఇరుపక్షాలూ గౌరవించాలి, దానికి కట్టుబడి ఉండాలి. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి భారత్ కానీ చైనా కానీ ప్రయత్నించకూడదు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, అవగాహనలకు ఇరుదేశాలూ పూర్తిగా కట్టుబడి ఉండాలి.
‘‘ఏప్రిల్-మే 2020 సమయంలో తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి పలు ప్రదేశాల వద్ద చైనా పెద్దసంఖ్యలో తమ సైనిక బలగాలను మోహరించడం వల్ల ఇరుదేశాల బలగాల మధ్యా చాలా ఘర్షణలు జరిగాయి. ఆ పరిస్థితుల వల్ల పెట్రోలింగ్ కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగింది. రవాణా పరంగా, వాతావరణ పరంగా, ఇంకా మరెన్నో రకాలుగా ఎన్ని సవాళ్ళు ఎదురైనా తట్టుకుని మన సైనిక బలగాలు ప్రత్యర్ధులను నిలువరించాయి. కోవిడ్ సమయంలో కూడా మన సైనికులు చాలావేగంగా, ప్రభావవంతంగా చైనా వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి అమలు చేసారు’’ అని జయశంకర్ చెప్పుకొచ్చారు.
‘‘తక్షణ స్పందనగా తగినంతమంది సైనికులను మోహరించడం జరిగింది, అదే సమయంలో ఇరు పక్షాల మధ్యా ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికీ దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా జరిగాయి. మిలటరీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య సుమారు పాతికసార్లు చర్చలు జరిగాయి. వాటి ఫలితంగానే ఇటీవల అక్టోబర్ ఒప్పందం జరిగింది. దానివల్లనే భారత్-చైనా బలగాలు తమ పాత స్థానాలకు మళ్ళీ వెళ్ళాయి. 2020 ఏప్రిల్‌కు ముందరి గస్తీ దారులు మళ్ళీ మొదలయ్యాయి. బ్రిక్స్ సమావేశం కోసం చైనా ప్రధాని షి జింపింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఒప్పందం కుదిరింది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడానికి అదొక రోడ్‌మ్యాప్. ఇరుదేశాల మధ్య సంబంధాలనూ సాధారణ స్థాయికి తేవడానికి అవసరమైన మొదటి అడుగుగా భారతదేశం చెబుతూవచ్చిన యథాతథ స్థితి ఆ ఒప్పందం.
దానిగురించి జయశంకర్ మాట్లాడుతూ, తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణాత్మక ప్రాంతాలైన దెప్సాంగ్, దెమ్‌చోక్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ అనేది మొదటి ప్రాధాన్య అంశమనీ, దాన్ని పూర్తిగా సాధించామనీ వెల్లడించారు. తదుపరి ప్రాధాన్యాంశం, అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తున్న వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా మోహరించిన సైనిక బలగాలను క్రమంగా తగ్గించుకుంటూ రావడమని జయశంకర్ చెప్పుకొచ్చారు.