కొత్త న్యాయచట్టాలతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలు చట్టం నుంచి తప్పించుకునే వీలు లేకుండా కొత్త చట్టాల రూపకల్పన జరిగిందని అన్నారు.
మూడు కొత్త న్యాయ చట్టాలను వంద శాతం అమలు చేసిన నగరంగా చండీఘడ్ ఘనత సాధించింది. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ, రాజ్యాంగ విలువలు, ప్రాముఖ్యతకు లోటు రాకుండా భారతీయ న్యాయ సంహిత రూపొందించినట్లు వివరించారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆశయాలు సాధించేందుకు కొత్త క్రిమినల్ చట్టాలు దొహదపడతాయన్నారు. డిజిటల్ ఆధారాలు, టెక్నాలజీ ఏకీకరణతో ఉగ్రవాదంపై పోరాడేందుకు సులువు అవుతుందన్నారు.
గతంలో ఉన్న క్రిమినల్ చట్టాలు భారతీయుల్ని శిక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాయని, వలసపాలన నాటి మైండ్సెట్ నుంచి దేశ ప్రజలు బయటపడాలన్నారు.
బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు చట్టాలను ఇటీవలే కేంద్ర సర్కారు రద్దు చేసింది.వాటి స్థానంలో కొత్త చట్టాలను అమలు చేస్తోంది.