ఉపాధి హామీ పథకం కింద ఏటా కొత్తగా 60 లక్షల జాబ్ కార్డులు జారీ చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 10.43 కోట్ల జాబ్ కార్డులు తొలగించారంటూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి పెమ్మసాని సమాధానం చెప్పారు. జాబ్ కార్డులు తొలగించే హక్కు రాష్ట్రాలకే ఉందని ఆ పని కేంద్రం చేయదని గుర్తు చేశారు. దేశంలో మొత్తం 14 కోట్ల జాబ్ కార్డులు ఉండగా ఏటా వివిధ కారణాల వల్ల 30 లక్షల కార్డులను వివిధ రాష్ట్రాలు తొలగిస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు.
దేశంలోని మొత్తం 14 కోట్ల జాబ్ కార్డుల్లో 9 కోట్లకుపైగా కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయని మంత్రి పెమ్మసాని లోక్‌సభలో స్పష్టం చేశారు. నరేగా పథకం నిధులు 57 శాతం పెంచినట్లు గుర్తుచేశారు. పథకంలో అవినీతికి తావులేకుండా చేసేందుకు ఆధార్‌తో సీడింగ్ చేసినట్లు తెలిపారు.
నరేగా పథకం ద్వారా ఏటా 96 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. పలు రాష్ట్రాలు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని, ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ నరేగా పథకానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారని గుర్తుచేశారు.