మనదేశంలో మొబైల్ మాల్వేర్ మోసాలు ఏటా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని తాజా నివేదిక ఒకటి బలపరుస్తోంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అమెరికా రెండో స్థానంలోకి వెళ్లగా భారత్ మొదటి స్థానంలోకి చేరింది. ప్రపంచంలోని మొత్తం మొబైల్ మాల్వేర్ దాడుల్లో 28 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. అమెరికాలో 27 శాతం, కెనడా 15 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో దాదాపు 2 కోట్ల మొబైల్ మాల్వేర్ మోసాలు జరిగాయని ఓ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆందోళక కలిగిస్తోంది.
నకిలీ సాఫ్ట్‌వేర్లు డౌన్లోడు చేసుకోవడం ద్వారానే సగం మంది మోసపోతున్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెరిగాయి. ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకుల వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్ల ద్వారా సమాచారం దోచుకుంటున్నారు. కార్డు అప్ డేట్ పేరుతో ఖాతాదారుల సమాచారం చోరీ చేసి మోసాలకు పాల్పడుతున్నారని ఓటీ థ్రెడ్ నివేదిక వెల్లడించింది.
మొబైల్ స్పైవేర్ దాడులు 111 శాతం పెరిగాయి.ఫోనీ బ్యాంకింగ్ వెబ్‌సైట్ల ద్వారా బ్యాంకుల సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. మాల్వేర్ దాడుల ద్వారా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని బ్రేక్ చేస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా సైట్‌లు క్రిప్టో వాలెట్‌ల కోసం నకిలీ లాగిన్ పేజీలను ఫిషింగ్ వెక్టర్ ద్వారా సమాచారం దొంగిలిస్తున్నారు.
భారతీయ తపాలా శాఖను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపడం, క్రెడిట్ కార్డు అప్‌డేట్ చేయాలంటూ ఫిషింగ్‌కు పాల్పడుతున్నారు. లెగసీ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో వందల కొద్దీ నకిలీ అప్లికేషన్లను గుర్తించారు. ఏటా ఇవి 45 శాతం పెరుగుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జీరో ట్రస్ట్ భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే తీవ్ర నష్టం తప్పదని ఆర్బీఐ హెచ్చరించింది.