ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ వాసి, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వెంకట దత్త సాయిని వివాహమాడనున్నారు. ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ వేదికగా ఏడు అడుగులు వేయనున్నారు. రెండు కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో పరిచయం ఉందని సింధు తండ్రి రమణ తెలిపారు. నెల కిందటే పెళ్లి ఖాయం చేసుకున్నామని వివరించారు.
జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడాల్సి ఉన్నందున డిసెంబరు 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించామన్నారు. 24న హైదరాబాద్‌లో విందు ఉంటుందని వెల్లడంచారు. ఈ నెల నుంచి పెళ్ళి పనులు ప్రారంభం కానున్నాయి.
పీవీ సింధు ఇప్పటి వరకు రెండు ఒలింపిక్ పతకాలు సాధించారు. ప్రపంచ ఛాంపియన్ గాను ఘనత సాధించారు. తాజాగా జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి పై విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె టైటిల్ సాధించారు.