తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేటి ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.
సర్వభూపాల అంటే రాజులందరూ అని అర్థం. దిక్పాలకులు కూడా ఈ జాబితాలో చేరతారు. వీరంతా స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తూ ఉంటారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి మనం తెలుసుకోవాలి.
శ్రీవారి హృదయ పీఠంపై నుంచి అలమేలుమంగమ్మ లోకాన్ని కటాక్షిస్తుంటే, సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తారు.సర్వ భూపాల వాహనంపై విహరించే శ్రీ పద్మావతి దేవిని దర్శిస్తే కీర్తి, యశస్సు, పదవీ యోగం కలుగుతాయని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
నేటి సాయంత్రం 4.20 గంటల నుంచి అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో అంటే సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.