ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయంటూ భారత టీవీ ఛానళ్లను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ మీడియాలో పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. భారత్‌లో బంగ్లాదేశ్ గురించి కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీని వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయంటూ ఓ న్యాయవాది పిటిషన్ వేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోయి యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. రిజర్వేషన్ల వ్యవహారంలో హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించిన తరవాత, బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు మరింత పెరిగాయి. తాజాగా ఛటోగ్రామ్ ప్రాంతంలో అల్లరి మూకలు మూడు దేవాలయాలను ధ్వంసం చేశాయి. హిందువులపై దాడులకు దిగారు.
దేవాలయాల ధ్వంసం, హిందువులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్మోయ్ అరెస్టుకు నిరసనగా హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హిందువుల నిరసన కార్యక్రమంలో ఓ న్యాయవాది చనిపోయిన తరవాత ఇస్కాన్‌కు చెందిన మరో ప్రతినిధిని కూడా బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హిందువుల హక్కులు కాపాడాలంటూ పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో కూడా భారత ప్రతినిధులు లేవనెత్తారు. దీనిపై బంగ్లాదేశ్ సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంది. చిన్మోయ్ అరెస్టుకు సరైన కారణాలున్నాయంటూ సమాధానం చెప్పడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.