211 పరుగుల తేడాతో విజయం
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. 212 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమన్ అజేయ సెంచరీతో రాణించాడు. 118 బంతుల్లో 122 పరుగులు చేశాడు. కేపీ కార్తికేయ (57), ఆయుశ్ మాత్రే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేయగల్గింది.
వైభవ్ సూర్యవంశీ 23 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆండ్రీ సిద్దార్థ్( 35) ఫరవాలేదనిపించగా నిఖిల్ కుమార్ (12), హర్వన్ష్ సింగ్ (1) నిరాశపరిచారు. హార్దిక్ రాజ్ (25*) నాటౌట్ గా మిగిలిపోయాడు.
జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ చెరో రెండు వికెట్లు తీయగా, చార్లెస్ హింజ్, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.
లక్ష్య ఛేదనలో జపాన్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ నిహార్ పర్మార్ (14) మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. హార్దిక్ రాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో స్కోర్ బోర్డు 50 పరుగులు వద్ద ఉన్నప్పుడు జపాన్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 53 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కోజి హార్డ్ గ్రేవ్ అబే ను కార్తికేయ డకౌట్ చేశాడు. 25.2 బంతికి కజుమా కటో(8) ను హార్థిక్ రాజ్ రనౌట్ చేయడంతో 70 పరుగుల వద్ద జపాన్ మూడో వికెట్ పడింది. అర్ధ శతకం కొట్టిన తర్వాత హ్యూగో కెల్లి ఔట్ అయ్యాడు. 111 బంతులు ఆడి 50 పరుగులు చేసిన కెల్లీ, హార్దిక్ రాజ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిమోతీ మోరీ(1) ని కార్తికేయ వెంటనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. దీంతో 38 ఓవర్లకు జపాన్ ఐదు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఆదిత్య పడ్కే (9) యుద్జిత్ గుహ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో 47 ఓవర్లు ముగిసే సరికి జపాన్ ఆరు వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చిన ఆటగాళ్ళు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కీపర్ యమమాటో(1), మాక్స్ (0) గా వెనుదిరిగారు. దీంతో 50 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. భారత్ 211 పరుగులు తేడాతో విజయం సాధించింది.
గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాజైబ్ ఖాన్ (132), మొహమ్మద్ రియాజుల్లా (106) శతకాలు చేశారు. లక్ష్య ఛేదనలో యూఏఈ 245 పరుగులు మాత్రమే చేయగల్గింది. 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ 69 పరుగులు తేడాతో విజయం సాధించింది.