1984 డిసెంబర్ 2-3తేదీల మధ్య రాత్రి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మహావిపత్తు చోటుచేసుకుంది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల కర్మాగారం నుంచి అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసో సయనేట్ (ఎంఐసి) అనే విషవాయువు లీక్ అయింది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆ పారిశ్రామిక ప్రమాదంలో 15వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 6లక్షల మంది ప్రజల ఆరోగ్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. కొన్నితరాల పాటు పిల్లలు అవకరాలతో పుట్టారు. ఆ విషాదం కేవలం పారిశ్రామిక ప్రమాదం మాత్రమే కాదు, దేశ ప్రజలను రక్షించడంలో అప్పటి భారత ప్రభుత్వపు వైఫల్యాన్ని నిరంతరం గుర్తుచేసే ఘట్టం. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విషవాయు బాధిత ప్రజలకు న్యాయం చేకూర్చడం కంటె రాజకీయపరమైన, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
ఆ ప్రమాదానికి బాధ్యుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ ఛైర్మన్ వారెన్ ఆండర్సన్ ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే దేశం విడిచిపెట్టి స్వదేశమైన అమెరికాకు వెళ్ళిపోగలిగాడు. ఆండర్సన్ అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో దేశం విడిచిపెట్టి పారిపోగలగడానికి సహాయం చేసింది కాంగ్రెస్ నాయకులే. ఆ దురదృష్టకర సంఘటన వివరాలను తరచిచూస్తే, ఆండర్సన్‌ను అమెరికాకు పంపించేయడం వెనుక రాజీవ్ గాంధీ ప్రమేయం ఉందని తెలుస్తుంది. ‘క్విడ్-ప్రో-కో’లో భాగంగా రాజీవ్ గాంధీ, ఆండర్సన్ లాభపడితే భోపాల్ బాధితులు దారుణంగా మోసపోయారు, అన్యాయమైపోయారు.
గ్యాస్ లీక్ వల్ల కలిగిన గందరగోళంలోనే ప్రజలు ఆ దుర్ఘటనకు జవాబుదారీగా ఎవరినైనా నిలబెట్టాలని పట్టుపట్టారు. సంస్థ ఛైర్మన్ అయిన వారెన్ ఆండర్సన్, నష్టనివారణ చర్యలను పర్యవేక్షించడానికి భోపాల్‌కు డిసెంబర్ 7న వెళ్ళాడు. అప్పటికే లిఖితపూర్వకంగా జారీ చేసిన ఆదేశాల ఆధారంగా స్థానిక అధికారులు ఆండర్సన్‌ను అరెస్ట్ చేసారు. అయితే ఆ న్యాయం, ఆ జవాబుదారీతనం కేవలం రెండు గంటలు మాత్రమే నిలిచింది.
ఆండర్సన్‌ను మొదట ఒక గెస్ట్‌హౌస్‌లో హౌస్ అరెస్ట్ చేసారు. కానీ తర్వాతి పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. మధ్యప్రదేశ్‌లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఆదేశాల మేరకు హుటాహుటిన ఆండర్సన్‌కు రూ.25వేల పూచీకత్తు మీద బెయిల్ మంజూరయింది. పోలీసులు అతన్ని దగ్గరుండి విమానాశ్రయానికి తీసుకువెళ్ళారు. ముందు ఢిల్లీ వెళ్ళిన ఆండర్సన్ అక్కడినుంచి విమానమెక్కి భారతదేశం వదిలిపెట్టి పారిపోయాడు. ఆండర్సన్ తన స్వదేశం అమెరికాకు క్షేమంగా చేరేవరకూ అర్జున్ సింగ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించాడు. ఆండర్సన్ మళ్ళీ ఇంక భారత్‌కు తిరిగి రానే లేదు. ఆ కేసు విచారణకు హాజరు అవనేలేదు. అలా ఆండర్సన్ భారత్ నుంచి తప్పించుకుని పోవడానికి తుది అనుమతి ఎవరిచ్చారో ఇప్పటికీ తెలీదు కానీ ఆ చర్య, న్యాయానికి జరిగిన మోసమే.
ఆ సమయంలో భోపాల్ ఎస్‌పిగా పనిచేసిన స్వరాజ్ పూరీ చెప్పిన వివరాల ప్రకారం ఆండర్సన్‌ను ‘ఉన్నతస్థాయి వ్యక్తులు’ మౌఖికంగా జారీ చేసిన ఆదేశాల మేరకు విడుదల చేసారు. ఆ ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరన్నది అధికారికంగా ఇప్పటికీ వెల్లడి కాలేదు. అయితే ‘ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ది అవర్‌గ్లాస్ ఆఫ్ టైమ్’ అనే తన జీవిత చరిత్రలో అర్జున్ సింగ్, అప్పటి కేంద్రప్రభుత్వంలో పీవీ నరసింహారావు మంత్రిగా ఉన్న హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని రాసాడు.
అయితే అర్జున్ సింగ్ ఆరోపణలను అప్పటి హోంశాఖ కార్యదర్శి ఆర్‌డి ప్రధాన్ తీవ్రంగా ఖండించారు. ఆండర్సన్ దేశం వదిలిపెట్టి పోయిన కొన్ని వారాల తర్వాతే, జనవరి 1985లో పీవీ హోంశాఖ మంత్రిగా విధుల్లో చేరారని స్పష్టం చేసారు. అర్జున్ సింగ్ పీవీ మీద ఆరోపణలు చేయడానికి కారణం బహుశా సోనియాగాంధీ నుంచి వచ్చిన ఒత్తిడి అయి ఉండొచ్చని ప్రధాన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆ వివాదంలో రాజీవ్ గాంధీ పేరు లేకుండా చేయడానికి ఆమెకు తన సొంతకారణాలు ఉండి ఉండొచ్చని ప్రధాన్ సూచించారు.
అర్జున్ సింగ్ మీద శక్తివంతురాలైన ఇటాలియన్ మహిళ నుంచి ‘బయటి ఒత్తిడి’ వచ్చి ఉండిఉండొచ్చని ప్రధాన్ సూచించారు. ఎస్‌పి స్వరాజ్ పూరీ చెప్పిన ఆ మౌఖికమైన ఆదేశాలు జారీచేసిన ఉన్నతస్థాయి వ్యక్తి ఎవరన్నది ఎప్పటికీ అధికారికంగా తెలియలేదు, కానీ దొరుకుతున్న ఆధారాలను బట్టి అది అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీయే అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గ్యాస్ లీక్ విషాదం సమయంలో భోపాల్ కలెక్టర్ మోతీసింగ్ కొన్ని వివరాలు చెప్పారు. ఆండర్సన్‌ను గెస్ట్‌హౌస్‌లో ఉంచినప్పుడు అతను ఆ గెస్ట్‌హౌస్‌లోని ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి అమెరికాలోని కొందరు వ్యక్తులకు కాల్ చేసాడని మోతీ సింగ్ తెలియజేసారు. బహుశా అతను తన ఎస్కేప్ ప్లాన్‌ను సమన్వయం చేసుకోడానికి ఆ అవకాశాన్ని వాడుకొని ఉంటాడు.
అప్పటి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి అమెరికా ప్రభుత్వానికీ మధ్య క్విడ్ ప్రో కో డీల్ కుదిరిందన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరో చెడ్డ మలుపు తిరిగింది. ఆ డీల్‌లో కేంద్రస్థానంలో ఉన్నది ఆదిల్ షహర్యార్. నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రుడూ అయిన మొహమ్మద్ యూనస్ కొడుకే ఆ ఆదిల్ షహర్యార్. అప్పటికి ఆదిల్ అమెరికాలో మోసం, పేలుడుపదార్ధాలు కలిగి ఉండడం, తగులబెట్టడం వంటి నేరాలకు 35ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.
ఆదిల్ షహర్యార్‌ను 1981లో అమెరికాలోని ఫెడరల్ కోర్టు పలుకేసుల్లో దోషిగా తేల్చింది. అతనికి 35ఏళ్ళ శిక్ష విధించింది. అతని నేరాల తీవ్రత ఎంతటిదైనప్పటికీ, 1925 జూన్ 11న అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అదేరోజు రాజీవ్ గాంధీ అమెరికాలోని వాషింగ్టన్‌కు పర్యటనలకు వెళ్ళారు.
క్షమాభిక్ష పెట్టిన సమయం కారణంగా, ఆండర్సన్ భారత్ నుంచి తప్పించుకోవడం కూడా పెద్ద కుట్రలో భాగమేనన్న అనుమానాలు తలెత్తాయి. ఆదిల్ షహర్యార్‌ను విడుదల చేయడానికే ఆండర్సన్‌ను అమెరికాకు పంపించేసారు. మరికొన్ని కథనాల ప్రకారం, తన కొడుకు తరఫున మహమ్మద్ యూనస్ రాజీవ్ గాంధీ మీద ఒత్తిడి తెచ్చాడట. అంతేకాదు, నెహ్రూ-గాంధీ కుటుంబం గురించి నిగూఢమైన రహస్యాలను వెల్లడిస్తానని బెదిరించాడట. ఆ రహస్యాల్లో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక జవహర్‌లాల్ నెహ్రూ ప్రమేయం ఉందన్న సంగతి కూడా బైటపెడతానని బెదిరించాడట.
ఆ కాలక్రమాన్ని పరిశీలిస్తే, షహర్యార్‌కు స్వేచ్ఛ కోసం రహస్యంగా చేసుకున్న ఏర్పాటులో భాగంగానే ఆండర్సన్‌ను తరలించేసారన్న అనుమానాలు కలుగుతాయి. గాంధీ కుటుంబంతో తనకున్న సన్నిహిత సంబంధాలను వాడుకుని తన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవాలంటూ మొహమ్మద్ యూనుస్ రాజీవ్ గాంధీ మీద ఒత్తిడి చేసాడని సమాచారం.
భారతదేశపు న్యాయస్థానాలు వారన్ ఆండర్సన్‌ను ‘ఫ్యుజిటివ్’ (పారిపోయినవాడు) అని ప్రకటించాయి. 2014లో చనిపోయేంత వరకూ అతన్ని భారత్ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. ఆండర్సన్‌ను అప్పగించడం కోసం ఎన్ని డిమాండ్లు చేసినా ప్రభుత్వాలు అతన్ని భారత్ తీసుకురావడంలో విఫలమయ్యాయి. ఆ విషాద ఘటన బాధితులు నామమాత్రపు పరిహారంతో, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో, ఆనాటి మరపురాని కాళరాత్రి అనుభవాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
భారతీయ న్యాయవ్యవస్థ 2010లో యూనియన్ కార్బైడ్ సంస్థకు చెందిన 8మంది మాజీ ఉద్యోగులను దోషులుగా ప్రకటించింది. అయితే యూనియన్ కార్బైడ్ సంస్థ, ఆండర్సన్‌ల నేర తీవ్రతతో పోలిస్తే వారికి ప్రకటించిన శిక్షలు నామమాత్రమే.
భోపాల్ గ్యాస్ విషాదంలో కోల్పోయిన వేలాది ప్రాణాల కంటె తమ కుటుంబానికి సన్నిహితులైన వారి ప్రయోజనాలకే రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని అన్ని సాక్ష్యాలూ, ఆధారాలూ సూచిస్తున్నాయి. తప్పించుకుని పారిపోయిన వారెన్ ఆండర్సన్ కానీ, యూనియన్ కార్బైడ్ సంస్థ కానీ ఏమాత్రం చట్టపరమైన జవాబుదారీతనాన్ని ఎదుర్కొనలేదు. కానీ వ్యవస్థ నిర్లక్ష్యం, నామమాత్రపు పరిహారంతో ఆ విషాద ఘటన బాధితులను ప్రభుత్వాలు గాలికొదిలేసాయి.
భోపాల్ గ్యాస్ బాధిత ప్రజలను పట్టించుకోకుండా ఆ ప్రమాదానికి కారణమైన వారిని సగౌరవంగా విమానమెక్కించిం స్వదేశానికి తరలించిన ఆ మోసం… న్యాయవ్యవస్థ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిర్లక్ష్యానికీ అగౌరవ ధోరణికీ నిదర్శనం. దేశ సంక్షోభాలను సైతం తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశవాదానికి తార్కాణం. ఆ పార్టీలో పాతుకుపోయిన బేఫర్వా, జవాబుదారీతనం లేని విధానానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రజాస్వామ్యం, పరిపాలనల కంటె నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండడమే ముఖ్యమని భావించే కాంగ్రెస్ పార్టీ రాజకీయ భ్రష్టత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ.
భోపాల్ విషాదం కార్పొరేట్ నిర్లక్ష్యపు కథ ఎంతమాత్రం కాదు. రాజకీయ భాగస్వామ్యపు కఠోరమైన నేరారోపణ. ఆండర్సన్‌ను తప్పించడం కోసం అర్జున్ సింగ్ చేసిన చర్యలు, అమెరికాతో రాజీవ్ క్విడ్ ప్రో కో ఒప్పందం… న్యాయాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి సజీవ సాక్ష్యాలు.
భోపాల్ బాధితులు నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇంకా చాలామందికి సరైన పరిహారం, వైద్యసహాయం అందనేలేదు. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం తమ జవాబుదారీతనం నుంచి తప్పించుకుంది. తప్పును వేరొకరి మీదకు నెట్టేయడం, అధికారులు బాధ్యతను తిరస్కరించడం వంటి సాకుల సాలెగూడు వెనుక నక్కింది.
విషవాయు విషాదం జరిగి నాలుగు దశాబ్దాలు గడచిపోయింది. ఇప్పటికీ బాధిత కుటుంబాలు న్యాయం కోసం అలమటిస్తున్నాయి. వారెన్ ఆండర్సన్ విడుదల గురించిన నిజాలు, రాజీవ్ గాంధీ పాత్ర, క్విడ్ ప్రో కో ఒప్పందపు ఆరోపణలు పూర్తిగా వెల్లడి కావాలి. బాధాకరమే అయినా అలాంటి నిజాలను ఎదుర్కొనగలిగినప్పుడే భారతదేశ ప్రజలకు అలాంటి మోసం ఇంకొకసారి జరగదన్న ఆశ ఉంటుంది.