భారతీయ కుటుంబాల్లో కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల రేట్లు తగ్గుముఖం పడుతుండడం, సమాజం మీద ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. నాగపూర్లో కథాలే వంశానికి చెందిన కుటుంబాల సమ్మేళనానికి హాజరైన భాగవత్, మన సంస్కృతికి సహజసిద్ధమైన వాహకం కుటుంబమేనని, కుటుంబ విలువలను నిలబెట్టుకోవాలనీ హితవు పలికారు.
జనాభా విషయంలో పాత నిర్దేశకాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు. ‘‘1998 లేదా 2002లో మన జనాభా విధానం చెప్పిన దాని ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1కంటె తక్కువకు పడిపోకూడదు. జనాభా పెరుగుదలలో పతనం సమాజానికి ప్రమాదకరం అంటూ, జనాభా శాస్త్రం కూడా అదే చెబుతుంది. జనాభా పెరుగుదల రేటు 3 ఉండడం మంచిది, కనీసం అది 2.1కంటె తక్కువకు పడిపోకూడదు. లేని పక్షంలో అలాంటి సమాజాన్ని ఇతరులెవరో ధ్వంసం చేయనక్కరలేదు, ఆ సమాజం దానంతట అదే నాశనమైపోతుంది’’ అని వివరించారు.
టోటల్ ఫెర్టిలిటీ రేట్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో దాన్ని పెంచుకోడానికి ప్రపంచంలోని 55 దేశాలు విధానాలకు రూపకల్పన చేసాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. మన దేశంలో రీప్లేస్మెంట్ రేట్ 1.9 నుంచి 2.0 మధ్యలో ఉంది. ఆ నేపథ్యంలో జనాభా పెరుగుదల రేటును కనీసం 2.1 ఉండేలా చేసేందుకు ప్రయత్నాలు జరగాలని భాగవత్ పిలుపునిచ్చారు.
భాగవత్ తన ప్రసంగంలో కులధర్మం ప్రాధాన్యత గురించి వివరించారు. భారతీయ సమాజానికి కుటుంబ విలువలే బలమైన పునాదులని చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొనడానికి, వాటికి పరిష్కారాలు కనుగొనడానికీ భారతదేశం ఒక నమూనాను ప్రపంచం ముందు ఉంచాలన్నారు. భారతదేశం నిలబడాలంటే కుటుంబ వ్యవస్థ నిలబడి ఉండాలని వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఐదు పరివర్తనాల గురించి పని చేస్తోంది, వాటిలో కుటుంబ ప్రబోధనం ప్రధానమైనది. అది సమాజంలో పరివర్తన తీసుకొస్తుందని డాక్టర్ భాగవత్ చెప్పారు.
సమాజపు సాంస్కృతిక విలువలను, స్థిరత్వాన్నీ కాపాడడంలో కుటుంబం అనే యూనిట్ అత్యంత ప్రధానమైనది అని భాగవత్జీ వెల్లడించారు. ‘‘ఒక కుటుంబాన్ని ఒక ప్రమాణంగా తీసుకుంటే ఆ కుటుంబం సంస్కృతిని, విలువలను ఒక తరం నుంచి తరువాతి తరానికి అందజేస్తుంది. తద్వారా కాలాతీతమైన, ప్రపంచానికి తగిన వ్యవస్థలు పరిరక్షించబడతాయి’’ అని సర్సంఘచాలక్ చెప్పుకొచ్చారు.
కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండడం అనేది భారతీయ సంస్కృతికి చిహ్నమని భాగవత్ గుర్తు చేసారు. ఇతర దేశాల్లో కనిపించే వైయక్తిక (వ్యష్టి) ధోరణికి భిన్నంగా మన దేశంలో సమష్టి వైఖరి ఉందని చెప్పారు. ‘‘భారత సంస్కృతి పరస్పర సంబంధాల్లో విశ్వాసం కలిగి ఉన్న సంస్కృతి. ఎవరికైనా ఆకలిగా ఉంటే మనం సాయం చేయడానికి ముందుకొస్తాం. మన గుమ్మంలోకి బిచ్చగాడు వస్తే అన్నం పెడతాం లేదా డబ్బులు ఇస్తాం. ఆ పని మన ఇంట్లోని చిన్నపిల్లల ద్వారా చేయిస్తాం. తద్వారా సహానుభూతి, త్యాగం అనే విలువలను తర్వాతి తరాలకు అందజేస్తుంటాం’’ అని వివరించారు.
భారతదేశ ప్రజలు కుల మతాల విభజనలకు అతీతంగా ఉండాలని భాగవత్జీ కోరారు. త్యాగం, సమష్టి బాధ్యత భారతీయ సమాజానికి పునాదిరాళ్ళు అని గుర్తు చేసారు. కుల వివక్షను కుటుంబ స్థాయిలోనే తొలగించివేస్తే మన సమాజంలోనుంచి ఆ సమస్య దానంతట అదే తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. ‘‘స్వార్థమో, వ్యక్తిగత ప్రయోజనాలో కాదు త్యాగమే మనకు ప్రధానం’’ అని నొక్కిచెప్పారు.