విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజ అభ్యున్నతే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ ఏర్పడి అరవయ్యేళ్ళు గడిచాయి. హిందూ అస్తిత్వం గురించిన చైతన్యాన్ని హిందువుల్లో ప్రచారం చేయడం, పరాయి మతాల దాడుల గురించి చైతన్యవంతులను చేయడం, వాటికి ప్రతిగా స్పందించి హిందువుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడడం వంటి కార్యక్రమాలతో విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ విస్తరిస్తోంది. ఆ వివరాల గురించి విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర శర్మ ఆంధ్రాటుడేకు ప్రత్యేకంగా వెల్లడించారు. ఆ వివరాలను చూద్దాం….
♠ విశ్వహిందూపరిషత్ ప్రస్తుత కార్యస్థితి ఏమిటి? ప్రజల్లో ఎలా విస్తరిస్తోంది?
♦ విశ్వహిందూ పరిషత్ స్థాపించి అరవయ్యేళ్ళు గడిచాయి. మొన్న కృష్ణాష్టమికి షష్టిపూర్తి ఉత్సవాలు పూర్తయ్యాయి. భారతదేశంలో ధార్మికరంగంలో దినదిన ప్రవర్ధమానంగా విస్తరిస్తున్న, ధార్మిక సామాజిక సంస్థ విశ్వహిందూ పరిషత్. ఈ సంస్థకు దేశమంతటా 80వేలకు పైగా శాఖలు ఉన్నాయి. పరిషత్‌కు 62లక్షలకు పైగా హితచింతకులు ఉన్నారు. హిందూ సమాజానికి సంబంధించి అనేకమైన, అన్నిరంగాలలోనూ అన్ని విభాగాలలోనూ విశ్వహిందూ పరిషత్ గణనీయమైన ప్రగతి సాధిస్తూ ముందుకు వెడుతోంది. 60 సంవత్సరాల కృషి పరిణామంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హిందుత్వానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అందులో విశ్వహిందూ పరిషత్ పాత్ర కూడా గణనీయమైనది. హిందువులకు సంబంధించిన అనేకానేక ధార్మిక సామాజిక సమస్యల పరిష్కారంలో కూడా విశేషమైన కృషి చేసిన, ప్రగతి సాధించిన అనుభవం ఉంది. మతమార్పిడులను నిరోధించే విషయంలో గాని, వివిధ కారణాల చేత మతం మారినవారిని తిరిగి హిందుత్వంలోకి తీసుకొచ్చే పునరాగమన కార్యక్రమంలో గాని, బడుగు వర్గాలను – ప్రత్యేకించి మతమార్పిడులకు అవకాశం ఉన్న వెనుకబడిన ప్రదేశాల్లో వనవాసుల మధ్య, గిరిజనుల మధ్య, దళితుల మధ్య విశ్వహిందూ పరిషత్ వేలాదిగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సంస్కారాన్ని కలిగించే కార్యకలాపాలు – అన్నీ చక్కగా జరుగుతున్నాయి. వాటి నిర్వహణలో హిందూ సమాజం నుంచి సహకారము, మద్దతు, భాగస్వామ్యము కూడా విశ్వహిందూ పరిషత్తుకు లభిస్తున్నాయి.
♠ అయోధ్య రామాలయ నిర్మాణం విహెచ్‌పికి ఒక గొప్ప చారిత్రక విజయం. దాని తర్వాత భవిష్యత్తులో పరిషత్ ఏం చేయబోతోంది?
♦ విశ్వహిందూ పరిషత్ పని దేవాలయాల నిర్మాణం చేయడం కాదు. అయోధ్య దేవాలయానికి సంబంధించినది గొప్ప చారిత్రక విజయమే. మహమ్మదీయ ఆక్రమణకారుల పరిపాలనా సమయంలో లక్షల సంఖ్యలో దేవాలయాలను ధ్వంసం చేసి మజీదులుగా మార్చిన పరిస్థితిలో స్వతంత్ర భారతదేశపు రాజకీయ నేతలు పూనుకుని సాంస్కృతిక ధార్మిక కేంద్రాలుగా ఉన్న దేవాలయాలన్నింటినీ పునరుద్ధరించవలసిన బాధ్యతను స్వీకరించని దరిమిలా హిందువుల ఆరాధ్య దైవములైన రాముడు, కృష్ణుడు, శివుడు… వారికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలను విముక్తి చేయాలనే సాధుసన్యాసుల సూచన మేరకు, వారు అప్పగించిన బాధ్యత మేరకు, విశ్వహిందూ పరిషత్ సంస్థ రామజన్మభూమిని విముక్తం చేసి భవ్య రామమందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నది. అది విశ్వహిందూ పరిషత్ విజయం కాదు. యావత్ హిందూ సమాజపు విజయం. ఐదువందల సంవత్సరాలు అవిశ్రాంత పోరాటాన్ని సలిపి, ఐదువందల సంవత్సరాల క్రితం భారతమాత నుదుటిపైన ఏర్పరచిన కళంకాలలో ఒక కళంకాన్ని తుడిపివేసి భవ్య మందిరాన్ని హిందూ సమాజం నిర్మాణం చేసుకుంది. యావత్ హిందూ సమాజానికి చెందిన విషయం. కాబట్టి, మందిర నిర్మాణం అనేది మన లక్ష్యం కాదు, విదేశీ ఆక్రమణకారులు కలిగించిన నష్టాన్ని పూరించుకోవడమే లక్ష్యంగా హిందూ సమాజం తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది.
♠ వర్తమానంలో హిందుత్వం పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది? ప్రపంచంలో ఎలా ఉంది?
♦ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందన్న సంగతి సుస్పష్టంగా తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశ విదేశాలలో హిందుత్వం పట్ల విదేశీయులు ఆకర్షితులవుతున్నారు. మన కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకుంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా వివాహము కాంట్రాక్టు కాదు, అది జన్మజన్మాంతర సంబంధం కలిగిన బంధం, మనం కూడా కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలి అని భావిస్తూ అనేకమంది విదేశీయులు కుటుంబ పద్ధతిని స్వీకరిస్తున్న అనుభవాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలోనూ నవయువతలో కూడా హిందూ ఉత్సాహము, హిందూ చైతన్యమూ వెల్లివిరుస్తున్న అనుభవం కలుగుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాల కృషి, విశ్వహిందూ పరిషత్ అరవై సంవత్సరాల కృషి పరిణామమే ఇది. సంఘము, పరిషత్తుల కార్య పద్ధతిని విదేశీయులు సైతం పెద్దసంఖ్యలో అనుసరిస్తున్నారు అనే విషయం సుస్పష్టంగా అనుభవంలోకి వచ్చేలా హిందూ చైతన్యాన్ని ఇవాళ దేశమంతటా మాత్రమే కాదు, ప్రపంచం అంతటా కూడా చూడగలుగుతున్నాము.
♠ హిందుత్వం వేరు, సనాతన ధర్మం వేరు అంటూ ఈ మధ్య విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హిందుత్వం రాజకీయమే తప్ప ధర్మం కాదంటూ ప్రచారం చేస్తున్నారు. దానిపై విహెచ్‌పి స్పందన ఏమిటి?
♦ ధర్మం అనే పదాన్ని ఉపయోగించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ధర్మం అంటే తెలీను కూడా తెలియదు. మతం అనే రెండు అక్షరాలను ఉపయోగిస్తున్నారు. సనాతనము, హిందుత్వము, హిందూ ధర్మము అనే విషయాలను గురించి వ్యాఖ్యలు చేసే వారికి వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఏమిటి, హిందూ ధర్మం అంటే ఏమిటి, ఆ రెండూ ఒకటేనా కాదా, ఆ రెండూ వేరా అనే అవగాహనే వాళ్ళకు లేదు. హిందుత్వము, సనాతనం అనేవి ఒకటే. ఈ దేశానికి ప్రాణము హిందుత్వము, హిందూ ధర్మం, అదే సనాతన ధర్మం. హిందూ దేశమైన భారతదేశపు చరిత్రను పరిశీలిస్తే, ఇజ్రాయెల్‌ను మినహాయిస్తే ప్రపంచంలో వెయ్యి సంవత్సరాలు నిరంతరమైన పోరాటం జరిపి స్వతంత్రాన్ని పొందడానికి శక్తినీ సామర్థ్యాన్నీ ప్రేరణనూ ఇచ్చిన అంశము హిందుత్వం మాత్రమే. ఆబాలగోపాలాన్నీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ రామనామాన్నీ, భగవద్గీతనూ ఆశ్రయించే స్వతంత్ర ఉద్యమంలో సఫలీకృతులయ్యారు. ‘సారే జహా సే అచ్ఛా’ అనే పాటలో గీత రచయిత మహమ్మద్ ఇక్బాల్ ‘యూనాన్ ఓ మిస్ర్ ఓ రూమా సబ్ మిట్ గయే జహా సే, అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఔ(ర్) నిశా(న్) హమారా, కుఛ్ బాత్ హై కి హస్‌తీ మిట్‌తీ నహీ హమారీ’ అని రాసారు. గ్రీస్, ఈజిప్ట్, రోమన్ సామ్రాజ్యాలు పతనమై అంతమైపోయాయి. ప్రపంచంలో లేకుండా పోయాయి. గ్రీస్ ఉన్నది, కానీ అలెగ్జాండర్ వారసులమని చెప్పుకునేవారు లేరు. ఈజిప్టు ఉన్నది, పిరమిడ్లు నిర్మించిన వాస్తు శాస్త్రజ్ఞులు తమ పూర్వీకులు అని చెప్పుకునేవారు లేరు. రోమ్ ఉన్నది, జూలియస్ సీజర్ వారసులం అని చెప్పుకునేవారు లేరు. దాదాపుగా ఒకే ఒక ఆక్రమణలో సంపూర్ణంగా సమూలంగా నాశనమైపోయి మహమ్మదీయులుగానో, క్రైస్తవులుగానో మారిపోయిన చరిత్ర. సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలించినా, నూటయాభై సంవత్సరాలు ‘క్రైస్తవులైన’ బ్రిటిష్ వారు పరిపాలించినా రామ-కృష్ణ వారసులం మేము అని చెప్పి, ఐదువందల సంవత్సరాల క్రితం పడగొట్టిన దేవాలయాన్ని పునర్నిర్మించుకోగలిగిన శక్తినీ సామర్థ్యాన్నీ సమాజానికి అందించినది హిందూ ధర్మమే, సనాతన ధర్మం మాత్రమే. కేవలం రాజకీయ అధికార దాహంతో, సెక్యులరిజం అనే ముసుగులో ప్రేలాపనలు చేసే వారి వ్యాఖ్యలే ఇవి తప్ప, ఈ దేశపు ఆత్మ, ప్రాణమూ హిందుత్వమూ, హిందూ ధర్మమే.
♠ మన రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఎలా ఉంది? వారిని జాగృతం చేయవలసిన అవసరం ఉందా? ఎలా చేయాలి?
♦ భారతదేశంలో హిందువులు ఎలా ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో కూడా హిందువులు అలాగే ఉన్నారు. దేశమంతటా హిందువులను జాగృతపరచడం మాత్రమే కాక సంస్కారవంతులను కూడా చేయాలి. సామాజిక సంస్కారాలు, నైతిక జీవన మూల్యాలను పెంపొందించవలసిన దృఢమైన సంస్కారాలు హిందువులకు అలవరచాలి. క్రైస్తవ మతస్తులు, మహమ్మదీయులు పెట్టే ప్రలోభాలకు లోనుకాకుండా, లవ్ జిహాద్ వంటివాటికి వశం కాకుండా, మతమార్పిడులకు లోనుకాకుండా ఉండగల దృఢమైన హిందూ సంస్కారాలను అందించవలసిన ఆవశ్యకత యావత్ భారతదేశంలో ఎంత ఉన్నదో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంతే ఉన్నది. ఇక్కడ కూడా భారతదేశం మొత్తంలో ప్రపంచమంతటా కూడా చైతన్యవంతులు అవుతున్న విధంగా ఇక్కడి యువత, ఇక్కడి ప్రజలు కూడా హిందుత్వం వైపు చైతన్యవంతులు అవుతున్న అనుభవం కలుగుతోంది.
(సశేషం)