ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వానికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ అభినందనలు తెలియజేసింది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఇటీవల “నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్” (NMNF) అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. దానికి రూ.2481 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అందులో కేంద్రప్రభుత్వం నుండి రూ.1584 కోట్లు, రాష్ట్రాల నుండి రూ.897 కోట్లు కేటాయించారు.
ప్రకృతి వ్యవసాయం అనేది రసాయనాలు వాడని సాంప్రదాయిక వ్యవసాయ పద్ధతి. తరాల వారీగా అనుసరించిన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఇది స్థానిక పశువుల సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వివిధ పంటల వైవిధ్య భరితమైన పంట విధానాలు, మరియు స్థానిక పరిసరాలకు అనుగుణంగా ఆగ్రో-ఎకలాజికల్ సిద్ధాంతాలను సమన్వయం చేస్తుంది.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) పథకం రూపొందించారు. పొలాల్లో మట్టిని ఆరోగ్యంగా ఉంచడానికి, జీవ వైవిధ్యాన్ని పెంచడానికి, మరింత బలమైన వ్యవసాయ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికీ ఆ పథకం సహాయపడుతుంది. ప్రాచీన కాలపు వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ, వాతావరణ సామర్థ్యం, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తిపై దృష్టి సారిస్తుంది.
ఆ పథకాన్ని రెండేళ్ళలో 15వేల గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తారు. దాని ద్వారా కోటి మంది రైతులే లక్ష్యంగా 7.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తారు. ఆ కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత స్థానికంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలకు, స్వయం సహాయక సంఘాలు(SHGs), రైతు ఉత్పత్తి సంస్థలు (FPOs) వంటి రైతుల సంఘాలకు ఇస్తారు. అదనంగా 10వేల బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు (BRCs) ఏర్పాటు చేస్తారు, వాటి ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయానికి కావలసిన పదార్ధాలు సులువుగా అందిస్తారు.
రెండువేల ప్రకృతి వ్యవసాయం నమూనా క్షేత్రాలను కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ నమూనా క్షేత్రాలు రైతులకు ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, జీవామృతం, బీజామృతం వంటి పదార్ధాల తయారీపై శిక్షణ ఇస్తాయి. ఈ పథకం ద్వారా 18.75 లక్షల రైతులకు శిక్షణ ఇస్తారు. 30వేల మంది ‘కృషి సఖి’లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌తో మార్గదర్శనం అందిస్తారు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతుల వ్యయాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను పెంచుతూ వాతావరణ మార్పుల నుండి నిరోధకత పెంచుతాయి. ఈ ప్రక్రియలో రసాయనాలు, పశు ఆహారం నుండి వచ్చిన ఆరోగ్యపూరిత ప్రమాదాలను తగ్గించి, ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని రైతులకు అందిస్తాయి.
ప్రకృతి వ్యవసాయం అభ్యాసం చేస్తున్న రైతులు సులువుగా సర్టిఫికేషన్ పొందగలరు, సాధారణ బ్రాండింగ్ ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేయగలరు. ఆ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా, రియల్-టైమ్ జియో-ట్యాగ్డ్ మానిటరింగ్ ద్వారా ట్రాక్ చేస్తారు.
ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని ప్రభుత్వ పథకాలు, పశు అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెట్ లింకేజెస్ ద్వారా రైతులకు మద్దతు ఇస్తుంది. అందులో స్థానిక పశు జనాభా పెంచడం, మార్కెట్ అవకాశాలు కల్పించడం మొదలైనవి ఉన్నాయి. విద్యార్థులు ‘రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్‌పీరియెన్స్’ కార్యక్రమం ద్వారా NMNFలో పాల్గొంటారు. ప్రకృతి వ్యవసాయంపై నూతన విద్యా కోర్సులు UG, PG మరియు డిప్లొమా స్థాయిల్లో ప్రవేశపెడతారు.
ఏకలవ్య ఫౌండేషన్ తెలంగాణ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం విశేషంగా కృషి చేస్తోంది. ఈ పథకానికి మద్దతు ఇవ్వడానికి, ఏకలవ్య గ్రామీణ అభివృద్ధి ఫౌండేషన్ తమ కృషి విజ్ఞాన కేంద్రంలో బయోకంట్రోల్ లాబొరేటరీ ఏర్పాటు చేసి, 2700 రైతులకు 12500 లీటర్ల బయో-ఇన్పుట్స్ అందించింది. ఏకలవ్య గ్రామీణ అభివృద్ధి ఫౌండేషన్ ఈ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని ఆహ్వానిస్తూ, ఆ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తోంది.