పోలి పాడ్యమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నదీస్నానాలకు భక్తులు పోటెత్తారు. శివకేశవులకు పరమ పవిత్రమైన కార్తికమాసం ముగియడంతో భక్తిశ్రద్ధలతో దీపాలను నదిలో విడిచారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
కార్తికమాసం ముగింపును మార్గశిర శుద్ధ పాడ్యమిగా పిలుస్తారు. నదీ స్నానం ఆచరించిన తర్వాత ఆవు నేతితో ముంచిన వత్తులను అరటి దబ్బలలో పెట్టి వెలిగించి నీటిలో వదిలివేయడం ఈ పూజల్లో భాగం.
ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలు, ఇతర శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రాత కాలం నుంచే ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైన అమ్మవారిని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.