తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు లో విషాదం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు . పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని రిసార్ట్స్ లో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల తెలిపిన వివరాల ద్వారా తెలిసింది.
ఆదివారం ఉదయం ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరిన హరీశ్, రిసార్ట్స్ లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా ఆయన ఫోన్ నంబరు పనిచేయలేదు. రిసార్ట్స్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో, వారు వాజేడు పోలీసు సిబ్బందికి సమాచారం అందజేశారు. రిసార్ట్స్ కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, ఆయన ప్రాణాలు విడిచి ఉన్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.