ఒక యువ ఐపీఎస్ అధికారి ఉద్యోగంలో చేరడానికి వెడుతూ ప్రమాదంలో చనిపోయిన దుర్ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. హర్ష్ బర్ధన్ అనే 26 ఏళ్ళ యువకుడు మధ్యప్రదేశ్ వాసి, 2023 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి.
హర్ష్ బర్ధన్ హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ తీసుకోవలసి ఉంది. హోళె నరసీపూర్లో ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పిగా ఛార్జి తీసుకోడానికి వెడుతున్నాడు. మైసూరు నుంచి హసన్ వెడుతుండగా కిట్టానే అనే గ్రామం దగ్గర పోలీస్ వాహనం టైర్ బరస్ట్ అయింది. ఆ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బైటపడ్డాడు.
టైరు బరస్ట్ అయి, డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం రోడ్డు పక్కనున్న ఒక ఇంటిని, చెట్టును గుద్దుకుంది. ఆ ప్రమాదంలో హర్ష బర్ధన్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే హర్ష బర్ధన్ చనిపోయాడు. వాహనం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, ఇతర ప్రధాన నాయకులు హర్ష బర్ధన్ అకాల మృతికి సంతాపం ప్రకటించారు.
హర్ష బర్ధన్ ఇటీవలే మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడెమీలో నాలుగు వారాల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. హసన్ జిల్లాలో పోస్టింగ్ కోసం వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.