ఊరేగింపుగా తిరుమల నుంచి తిరుచానూరుకు లక్ష్మీకాసుల హరం
సాయంత్రం శ్రీవారి దేవేరికి గజవానసేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఐదోరోజుకు చేరుకున్నాయి. నేటి ఉదయం శ్రీ పద్మావతీ దేవికి పల్లకీ సేవ నిర్వహించారు. సుందరంగా అలంకరించిన పల్లకీపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను సిరులతల్లి అనుగ్రహించారు.
మధ్యాహ్నం వసంతోత్సవం, రాత్రికి గజవాహనసేవ నిర్వహించనున్నారు. పల్లకీపై మోహినీ అలంకారంలో పద్మావతీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవలో జియ్యంగార్లు, వేదపండితులు, అర్చకస్వాములు పాల్గొన్నారు. మంగళ వాద్యాలు, డప్పు ప్రదర్శనలు, భక్తుల కోలాటాల మధ్య అమ్మవారి ఊరేగింపు రంగరంగ వైభవంగా జరిగింది.
అమ్మవారి పల్లకీ ఉత్సవం కనులారా చూసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం పసుపు, గంధం, పన్నీరు, ఎర్రచందనం, కస్తూరి, పచ్చ కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో అమ్మవారికి అభిషేకం జరిపిస్తారు. దీనినే వసంతోత్సవం అంటారు. ఈ క్రతువును వీక్షించిన వారికి కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. రాత్రికి అమ్మవారికి గజవాహన సేవ నిర్వహిస్తారు. సనాతన ధర్మంలో ఐశ్వర్యానికి గజాన్ని ప్రతీకగా భావిస్తారు. గజవాహనసేవలో అమ్మవారికి లక్ష్మీకాసుల హరం అలంకరిస్తారు. దీనిని తిరుమల నుంచి తిరుపతికి ఊరేగింపుగా తీసుకొస్తారు.
బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. హనుమంతుడి ప్రీతి కోసం ఈ వాహన సేవ నిర్వహిస్తారు.