ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించిన వ్యక్తిపై కేసు నమోదైంది. మహారాష్ట్ర సీఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సయ్యద్ షుజా అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఐదేళ్ల కిందట ఇతనిపై ఢిల్లీలోనూ కేసు నమోదైంది. ప్రస్తుతం షుజా విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సయ్యద్ షుజా వీడియో వైరల్ అయింది. దీనిపై సీఈసీ సీరియస్‌గా తీసుకుంది. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మెషీన్ ఫ్రీక్వెన్సీలను వేరు చేయడం ద్వారా ఈవీఎంలను ట్యాంపర్ చేయగలనని షుజా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు. ఎన్నికల సమయంలో బాగా వైరల్ అయ్యాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం, బ్లూటూత్, వైఫైలకు కనెక్ట్ చేయడం కుదరదని, ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని హెచ్చరించింది.