భారత్ లో జనాభా తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో క్షీణత సమాజానికి మంచిదికాదన్నారు. జనాభా తగ్గుదల కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. . నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మోహన్ భాగవత్, కుటుంబాలు సమాజంలో భాగమని తెలిపారు.
జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే దిగువన నమోదు అవ్వడం సమాజానికి హనికరమన్నారు. భారత జనాభా విధానం కూడా ఈ రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూడదని చెబుతోందని ప్రస్తావించారు. మన దేశానికి సంబంధించి జనాభా రేటు మూడుగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 1960-2000 మధ్య రెట్టింపు కాగా ఆ తరవాత నుంచి తగ్గుముఖం పడుతోంది. పలు నివేదికలు ఈ విషయాన్ని పేర్కొన్నాయి. ప్రతీ మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేయగల్గుతాం. దీనినే జనాభా భర్తీ రేటు అంటారు.
జనభా రేటు 2.1కి దరిదాపుల్లో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉండగా, అమెరికా, బ్రెజిల్, మెక్సికోల్లో 2.1 కంటే తక్కువ ఉండగా.. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో అంతకన్నా తక్కువగా ఉంది.