అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డాలర్‌ను దూరంపెట్టేందుకు ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తక సంబంధాలకు దూరం కావాల్సిందేనని హెచ్చరించారు.
అంతర్జాతీయ లావాదేవీల విషయంలో డాలర్ స్థానంలో మరో కరెన్సీ వాడాలని ఇటీవల బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. దీనిపై స్పందించిన ట్రంప్, డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదన్నారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పన్నులు 100 శాతం పెంచుతామని బెదిరించారు.
బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామన్న ట్రంప్, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుండదని తేల్చి చెప్పారు. అమెరికాకు ఎగుమతుల విషయం మర్చిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రష్యాలోని కజన్‌లో అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో అంతర్జాతీయ లావాదేవీలలో డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీ వాడాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. దీంతో స్థానిక కరెన్సీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డాయి. ఈ సమావేశంలో ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ అంగీకారం తెలిపాయి.