డిసెంబర్ 2న తలపడనున్న జపాన్, భారత్
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్ కు భారీ ఓటమి ఎదురైంది. లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ తో తలపడిన భారత్, 43 పరుగుల తేడాతో ఓడింది.
దుబాయ్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ కు దిగింది.
ఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్ (60), షాజైబ్ ఖాన్( 159) మంచి ఆరంభం ఇచ్చారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్మద్ రియాజుల్లా 27 పరుగులు చేయగా మిగిలిన వారు విఫలం అయ్యారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 281 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ మూడు వికెట్లు తీయగా, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(1) విఫలం కాగా వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్(15) పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిష్క్రమించాడు. దీంతో భారత్ 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నిఖిల్( 67) చేసినప్పటకీ స్టంపౌట్ కావడంతో భారత్ కు విజయలక్ష్మి దూరమైంది. కిరణ్(20), హర్వన్ష్ సింగ్(26) ,మొహ్మద్ ఇనాన్(30 ) పోరాటపటిమ కనబరిచాడు.
యుధాజిత్ గుహ(12*) నాటౌట్ గా మిగిలపోయాడు. 47.1 ఓవర్లలో 238 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది.
పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా, అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు తీశారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ టోర్నీలో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డిసెంబరు 2న ఆడనుంది. అదే రోజున పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో తలపడనుంది.