రంగరంగ వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
నేటి రాత్రి ఏడుగంటలకు అమ్మవారికి హనుమంతు వాహన సేవ
తిరుచానూరు లో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం అమ్మవారు కల్పవృక్ష వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. శ్రీ రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు.
క్షీరసాగర మధించినప్పుడు అందులోనుంచి ఉద్భవించిన వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వజన్మలో చేసిన పనులు కూడా స్మరణకు వస్తాయి. కల్పవృక్షం మనం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. క్షీరసాగరం నుంచే శ్రీవారి దేవేరి లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అందుకే కల్పవృక్షం ఓ రకంగా చూస్తే అమ్మవారికి తోబుట్టువే అవుతుంది. కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ పద్మావతి దేవిని దర్శిస్తే కోరిన కోరికలన్నీ తీరడంతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయని వేంకటాచల మహాత్యంలో పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి సింహ వాహనంపై యోగనరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనిమిచ్చారు. తుఫాన్ కారణంగా వాహన మండపంలో భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు. మానవాళికి అవసరమైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, ప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను అమ్మవారు ప్రసాదిస్తారు.